BRS Candidates List: రెడీ టు రిలీజ్.. మొదటి లిస్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ

BRS Candidates List: హ్యాట్రిక్ కొట్టేందుకు అన్ని వ్యూహాలను అమలు చేస్తున్న గులాబీ బాస్

Update: 2023-08-21 05:46 GMT

BRS Candidates List: రెడీ టు రిలీజ్.. మొదటి లిస్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ 

BRS Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. గులాబీ దళపతి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 12గంటల తర్వాత పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ భవన్‌లో విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను 87నుంచి105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. తొలి దశలో ఎవరుంటారు అనే దానిపై అభ్యర్థుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలోకి దూకేందుకు రెడీ అవుతోంది. ఎన్నికలు నవంబర్‌లో జరుగుతాయని అంచనా వేస్తున్న కేసీఆర్.. దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య తీవ్ర విభేదాలు, ఆధిపత్య పోరు ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.

పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరుకు పార్టీ ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టింది. ఆధిపత్య పోరు, విభేదాలు పక్కన పెట్టి ఎవరికి పోటీ చేసే అవకాశం దక్కినా కలిసి పని చేసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులను ప్రకటించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేక గళం వినిపించే నేతల సంఖ్య పెరుగుతోంది.

ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశమివ్వాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్థుల ఖరారు కోసం బీఆర్‌ఎస్ నాయకత్వం.. కొన్ని నెలలుగా అనేక సర్వేలు చేయించింది. ఆ సర్వేల ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలను పిలిచి.. పని తీరు మార్చుకోవాలని కేసీఆర్, కేటీఆర్ హెచ్చరించారు.

అయితే తీరు మార్చుకోని నేతలు.. తరచుగా వివాదాస్పదంగా మారిన కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. దాదాపు 10 స్థానాల్లో కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సూర్యాపేట పర్యటనకు వెళ్లే ముందు.. తిరిగొచ్చాక కేసీఆర్ పలువురు ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థులపై తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తవచ్చని మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు కీలక నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈసారి పోటీ తీవ్రంగా ఉన్నందునే.. 3 నెలల ముందే టికెట్లు ప్రకటించేలా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చాలాచోట్ల అసంతృప్తి, అసమ్మతి భగ్గుమంటుందని పార్టీ వర్గాలు ముందే అంచనా వేశాయి. అసంతృప్తులను పిలిచి మాట్లాడే బాధ్యత ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలకు అప్పగించాలని నిర్ణయించారు.

అవసరమైనచోట హరీశ్‌రావు, కేసీఆర్ మాట్లాడాలని భావిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలను ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముందే పిలిపించి మాట్లాడి పరిస్థితి వివరించి భవిష్యత్‌పై హామీ ఇచ్చారు. అవకాశం ఇవ్వని సిట్టింగ్‌లకు భవిష్యత్తులో ఎమ్మెల్సీలుగా పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం. వీలైనంత వరకు నేతలెవరూ పార్టీ వీడకుండా నచ్చచెప్పే యోచనలో ఉన్న అధిష్ఠానం.. ఒకవేళ వినకపోతే వదిలేయాలని.. అయితే అలాంటి వారి వెంట ద్వితీయ శ్రేణి నాయకులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది.

అసంతృప్తులు, అసమ్మతులకు నచ్చచెప్పిన తర్వాత ప్రచారం ప్రారంభించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. రానున్న 3 నెలల్లో ప్రతి ఓటరును అభ్యర్థులు కనీసం నాలుగు నుంచి ఐదుసార్లు వ్యక్తిగతంగా కలిసేలా ప్రచార వ్యూహాలు రూపొందిస్తోంది. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోగా.. అభ్యర్థులు ప్రతి ఇంటికి కనీసం రెండుసార్లు వెళ్లాలనేది పార్టీ వ్యూహం.

Tags:    

Similar News