KCR: పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్
KCR: ఇవాళ తెలంగాణ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష
KCR: ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న బస్సుయాత్ర రూట్ మ్యాప్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలతో పాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం 95 లక్షల చెక్కును గులాబీ బాస్ అందించనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ.. ఈ దఫా కనీసం గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు.. నియోజకవర్గాల వారీగా సమావేశమై నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన బహిరంగ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలని గులాబీ దళపతి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి.. వారి కష్ట సుఖాలను తెలుసుకొని, వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో జరగబోయే సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై కూడా చర్చించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు.