Bhupalpally: జలదిగ్భంధంలో మోరంచపల్లి..హెలికాప్టర్‌ను పంపించండి.. సీఎం కేసీఆర్ ఆదేశం
Bhupalpally: భూపాలపల్లి జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
Bhupalpally: భూపాలపల్లి జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మొరంచ వాగు ఉధృతరూపం దాల్చింది. మొరంచపల్లి గ్రామ సమీపంలో వాగు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. నీటి ఉధృతి పెరగడంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద చుట్టేసింది. ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని చెట్లు, మేడలు ఎక్కారు స్థానికులు. వర్షంలో తడుస్తూ.. సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. మొరంచా వాగు ఉప్పొంగడంతో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో భూపాలపల్లి, పరకాల జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద చుట్టేయడంతో మొరంచా వాగులో లారీలు మునిగాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ లారీ పైకెక్కి కూర్చున్నారు డ్రైవర్లు. దీంతో వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో భారీ వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్ శాంతికుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. కాగా, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.