Kavitha Bail: ఇదేం 'సమ న్యాయం...?' దర్యాప్తు సంస్థలను ప్రశ్నించిన సుప్రీం కోర్టు
దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాదిరిగానే కవిత కూడా ఇప్పటికే ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. ఈడీ విచారణ పూర్తైంది.
కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
కవిత బెయిల్ సమయంలో సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది?
దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాదిరిగానే కవిత కూడా ఇప్పటికే ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. ఈడీ విచారణ పూర్తైంది.
దీంతో పిటిషన్ దారునికి కస్టడీ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45లోని నిబంధనలను ప్రస్తావిస్తూ ఒక మహిళగా ఆమె బెయిల్ పొందేందుకు అర్హురాలని కోర్టు తెలిపింది.
దిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఈ ఏడాది జూలైలో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ‘‘కవిత విద్యావంతురాలు, సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను ‘వల్నరబుల్ ఉమన్’గా భావించి మినహాయింపు ఇవ్వలేం’’ అని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఈ కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకు తన ఫోన్లను కవిత ఫార్మాటింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని జడ్జి చెప్పారు.
ఈ కారణాలతో కవిత బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చారు. అయితే కవిత బెయిల్ పిటిషన్ ను దిల్లీ హైకోర్టు తిరస్కరించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ పై మహిళలను విడుదల చేయడం సాధారణ సంప్రదాయమనే వాదనలున్నాయి. అయితే, ఆమె చదువు, హోదా, ఒక బలహీనమైన స్త్రీ అంటూ చట్టంలోని సంబంధిత సెక్షన్ ను హైకోర్టు తప్పుగా అన్వయించిందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. న్యాయపరమైన విచక్షణతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
కవిత తరపున ముకుల్ రోహత్గీ ఏం వాదించారంటే?
మహిళలు బెయిల్ పొందడం సాధారణ పద్దతి. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి. వీరిలో ఒకరు మైనర్. తల్లి జైలుకు పోయిందనే షాక్ లో ఉన్న మైనర్ మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు.
దిల్లీ లిక్కర్ స్కాంలో ‘ఆప్ కి సౌత్ గ్రూప్’ ఇచ్చినట్లు చెబుతున్న 100 కోట్లను ఏ దర్యాప్తు సంస్థా రికవరీ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాదు ఆమె ఐదు నెలల పాటు జైల్లోనే గడిపారని చెప్పారు. ఆమె మాజీ ఎంపీ. మహిళలు సాధారణంగా బెయిల్ పొందడం సాధారణ పద్దతి అనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఫోన్ లో మేసేజ్ లు డిలిట్ చేశారని ప్రాసిక్యూషన్ వాదనలు
అయితే, ఈ సమయంలో ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది కవితకు బెయిల్ ఇవ్వవద్దని అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదించారు. తన ఫోన్ లోని మేసేజ్ లను కవిత డిలిట్ చేశారని చెప్పారు. తన ఫోన్ ను ఫార్మెట్ చేశారని కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ ఏడాది జూన్ లో కవిత తన ఎనిమిది ఫోన్లను ఫార్మెట్ చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను అప్పట్లోనే కవిత కొట్టిపారేశారు. ఇవాళ కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనలను బోగస్ గా ముకుల్ రోహత్గీ చెప్పారు. కవిత ఉపయోగించిన ఫోన్ లో ఒక్క మేసేజ్ కూడా ఎందుకు లేదని ప్రాసిక్యూషన్ న్యాయవాది ప్రశ్నించారు. అయితే ఈ వాదనలతో కోర్టు కన్విన్స్ కాలేదు. మేసేజ్ లు డిలిట్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. నేను మేసేజ్ లను డిలీట్ చేస్తాను... ఇక్కడ ఉన్నవాళ్లు కూడా ఇలా చేస్తారని జస్టిస్ విశ్వనాథన్ చెప్పారు. అయితే ఫోన్ లోని కాంటాక్ట్స్ ను, హిస్టరీని డిలీట్ చేయరు కదా....అని ప్రాసిక్యూషన్ న్యాయవాది అన్నారు.
బెయిల్ కండిషన్లు ఇవీ
కవిత తరపున రూ. 10 లక్షల పూచీకత్తు బాండ్లు సమర్పించాలి. సాక్ష్యాలను టాంపర్ చేయవద్దు.. అదే సమయంలో సాక్షులను ప్రలోభాలకు గురిచేయవద్దని కూడా కోర్టు ఆదేశించింది. ఆమె తన పాస్ పోర్టును సరెండర్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.