Telangana: ఈటెలపై వేటుకు రంగం సిద్ధం.. ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని..
Telangana: ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేశారు.
Telangana: ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేశారు. తీర్మానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సంతకం చేశారు. ఈ లేఖపై మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రసమయి, మాజీ ఎంపీ వినోద్ తదితరులు సంతకాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఉమ్మడి కరీంనగర్ నేతలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక కేసీఆర్‌పై ఈటల విమర్శలు చేయడంపై మంత్రులు సీరియస్ అయ్యారు. పార్టీ ఇచ్చిన అవకాశాలు వినియోగించుకొని పార్టీ, కేసీఆర్‌పై విమర్శలు చేయడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్‌లో తనకు గౌరవం, విలువ దక్కలేదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈటల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం జరగలేదు. టీఆర్ఎస్‌ను విచ్ఛిన్నం చేసే విధంగా పలుసార్లు ఈటల మాట్లాడారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈటల అసైన్డ్ భూములు కొనడం తప్పుకాదా అని ప్రశ్నించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దళితుల భూములు కొనడానికి ఎలా సాహసించారని అడిగారు. అసైన్డ్ ల్యాండ్ యాక్ట్‌లు ఏముందో మీకు తెలియదా అని కొప్పుల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం బాధగా ఉందన్నారు. కొద్ది రోజులుగా ఈటల పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొప్పుల తెలిపారు. పార్టీ ద్వారా అనేక రకాలుగా ఈటల లబ్ధి పొందారు. మీకు ఏదో అన్యాయం జరిగిందని సీఎంపై దాడి చేయడం తగదు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.