నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం.. ముఖ్య అతిథిగా వస్తున్న కాకతీయుల వారసుడు
* 700 ఏళ్ల తర్వాత పురిటిగడ్డకు కాకతీయ వారసుడు
Warangal: చారిత్రక వరంగల్‌కు ఓ చరిత్ర వుంది. వందల ఏళ్ల క్రితం కాకతీయ రాజులు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించారు. రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ వైభవానికి గుర్తుంగా ఇప్పటికీ వరంగల్ నగరంలోని ప్రధాన రహదారికి సమీపంలోని వేయి స్థంభాల ఆలయం కిలా వరంగల్ కోట కాకతీయుల కళాతోరణం ఇప్పటికి గత చిరత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తూ నేటి తరానికి కూడా కాకతీయుల వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి. కాకతీయుల వైభవాన్ని నేటి తరాలకు తెలియజెప్పాలనే సదుద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలని ఇవాళ్టి నుంచి వరంగల్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈ వారోత్సవాల్లో పాల్గొనడానికి ప్రత్యేక అతిథిగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్‌లో కాకతీయుల వారసుడు కమల్ చంద్రభంజ్ దేవ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కాకతీయుల సామ్రాజ్యం అంతమైన దాదాపు 800 సంవత్సరాల తరువాత కాకతీయ సామ్రాజ్య వారసులు ఓరుగల్లు గడ్డపై ఒక చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అడుగుపెడుతుండటం ప్రత్యేకతని సంతరించుకుంది.
వరంగల్‌కు వస్తున్న కాకతీయుల వారసుడు కమల్ చంద్రదేవ్ భంజ్ ఎవరు? ఇన్నాళ్లూ ఎక్కడున్నాడు? వీరి సామ్రాజ్యం ఎక్కడ ఉంది? కాకతీయులకు కమల్ చంద్రదేవ్ భంజ్‌కు ఉన్న సంబంధం ఏంటీ? ఇన్నేళ్ల తరువాత వీరి గురించి బయటికి ఎలా తెలిసింది? ఇప్పడు కాకతీయుల రాజధాని వరంగల్ గడ్డకు రావడంపై వరంగల్ ప్రజలు, తెలంగాణ వారే కాకుండా యావత్ తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమల్ చంద్రదేవ్ భంజ్ ఎవరు? వీరి చరిత్ర ఏంటీ? ప్రతాపరుద్రుడి తోనే కాకతీయ సామ్రాజ్యం, వారుసుల అంతం కాలేదా? కాకతీయులకు నిజంగానే భంజ్ దేవ్ వంశస్తులు వారసులా? అనేక వివరాలు తాజాగా బయటికి వచ్చాయి.
దక్షిణాపథాన్ని దాదాపు రెండు శతాబ్దాలకు పైగా పాలించింది కాకతీయ వంశం. కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు చివరి రాజు. 1290 నుంచి 1323 వరకు ఆయన పాలించారు. ఢిల్లీ తుగ్లక్‌ల దాడిలో ప్రతాపరుద్రుడు ఓటమి పాలయ్యారు. వీరి వెంట ఉన్న ప్రతాపరుద్రుడి తమ్ముడైన అన్నమదేవుడు మార్గమధ్యంలో తప్పించుకుని దండకారణ్య ప్రాంతానికి పారిపోయాడు. అలా వెళ్లిన అన్నమదేవుడు బస్తర్‌లో రాజ్యాన్ని స్థాపించేందుకు స్థానిక గిరిజనులను సమీకరించాడు. అన్నమదేవుడు బస్తర్‌లో సైన్యాన్ని సమీకరించుకుని ఒకదాని తరువాత ఒక రాజ్యాన్ని జయిస్తూ వచ్చాడు. వరంగల్‌లో కాకతీయులకు కాకతీదేవి ఎలా కులదేవతో.. బస్తర్‌లోని అన్నమదేవుని వంశస్తులైన కాకతీయులకు దంతేశ్వరీదేవి ఆ విధంగా కులదేవతగా మారి పూజలందుకుందని చెబుతారు.
కాకతీయుల వారసుడిగా ఉన్న కమల్ చంద్ర భంజ్ దేవ్ 1984లో జన్మించారు. బ్రిటన్‌లో కాన్వెంటరీ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం పొలిటికల్ సైన్సులో పీజీ చేశారు. ప్రస్తుతం ప్రవీర్ సేన అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బస్తర్ కేంద్రంగా ఉన్న సర్వ్ సమాజ్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. యువకుడిగా, ఆధునిక భావాలు ఉన్న కాకతీయుల వారసుడిగా కమల్ చంద్ర వరంగల్, హైదరాబాద్ పర్యటనకు వస్తున్నందున ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.