Junior Doctors Strike: జూడాలతో ప్రభుత్వ చర్చలు విఫలం
Junior Doctors Strike: అత్యవసర సేవలు బహిష్కరించే యోచనలో ఉన్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు.
Junior Doctors Strike: తెలంగాణ ప్రభుత్వంతో జూడాలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతుందని ఆ సంఘం ప్రకటించింది. దీంతో అయితే ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని జూడాలు ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...సమ్మె విరమణపై బుధవారం డీఎంఈ రమేశ్ రెడ్డితో జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. అయితే, రేపటి నుంచి సమ్మె యధావిధిగా కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామని వారు తేల్చి చెప్పారు. చర్చల అనంరతం జూనియర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడారు.. రేపటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
రమేశ్ రెడ్డితో జరిపిన చర్చల్లో పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అందులో కొన్నింటిని వ్యతిరేకించడంతో చర్చలు సఫలం కాలేదు. కొవిడ్ మృతులకు పరిహారం ఇవ్వబోమని డీఎంఈ చెప్పారు. కొవిడ్ సోకిన వైద్య సిబ్బందికి నిమ్స్ లో బెడ్‌లు ఇచ్చే అంశం లేదన్నారు. 10 శాతం కొవిడ్ ఇన్సెంటివ్‌లు ఇవ్వడం కుదరదని తెలిపారు. ఈ ఏడాది జనవరి లేదా ఈ నెల నుంచి 15శాతం హైక్ ఇస్తామన్నారు. అయితే మంత్రి కేటీఆర్ ట్వీట్ చూసి సమ్మె విరమించాలని అనుకున్నాం కానీ డీఎంఈతో చర్చల్లో మాకు సరైన హామీ రాలేదని జూడాలు ఆరోపించారు. ప్రస్తుతానికి మా సమ్మె కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
జూడాల సమ్మె వల్ల రోగులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఓపీ సేవల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినప్పటికీ సమ్మె ప్రభావం వైద్యసేవలపై పడింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్, ఉస్మానియా, నిలోఫర్, సరోజినిదేవి తదితర ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. గాంధీ ఆసుపత్రిలోని కోవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులకు రోజువారీగా అందే సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి.