MLC Kavitha: కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు
MLC Kavitha: కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా ? అని ఉత్కంఠ
MLC Kavitha: నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. తన కుమారుడికి పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. ఈనెల 4న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలను విన్న న్యాయమూర్తి కావేరి భవేజా.. సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా? లేదా అనే ఉత్కంఠ సర్వాత్రా నెలకొంది.
కవిత జ్యుడీషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్ దొరకక పోతే.. మంగళవారం కవితను మళ్లీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే, సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20న జరగనుండడంతో.. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిహాడ్ జైలులో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తిహాడ్ జైలులోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు.
మరోవైపు శనివారమే కవిత తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణను రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేట్‌స్‌కో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్‌పై సీబీఐ తరఫున కూడా వాదనలు విన్న తర్వాతే.. ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టంచేశారు. కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సీబీఐని ఆదేశించారు. దీనికి సీబీఐ మూడురోజుల సమయం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపడతామని న్యాయస్థానం తెలిపింది.
సోమ, మంగళ, బుధవారాల్లో రౌస్ అవెన్యూ కోర్టు కవితకు సంబంధించిన కేసులను విచారించనుంది. కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా? లేదా కస్టడీని పొడిగిస్తారా? సీబీఐ విచారణకు అనుమతి ఇస్తారా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.