పవన్ రాకపోవడం బీజేపీకి ప్లస్సయ్యిందా...మైనస్సా?

Update: 2020-12-05 04:14 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్, గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారానికి వస్తానని చెప్పి మరీ రాలేదు. మరి పవర్‌ స్టార్ రాకపోవడం బీజేపీకి ప్లస్సయ్యిందా...మైనస్‌ అయ్యిందా? జనసేనాని క్యాంపెయిన్‌ చేసి వుంటే, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవా? లేదంటే ఇంతకంటే తక్కువ వచ్చేవా? పవన్‌ రాకపోవడం కాషాయానికి మేలు చేసిందా....కీడు చేసిందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని మొదట ప్రకటించారు. సొంతంగా యాభై, అరవై స్థానాల్లో కంటెస్ట్ చేస్తామన్నారు. జనసేనతో అసలు తమకు పొత్తేలేదని అటు బండి సంజయ్ ప్రకటించారు. దీంతో కమలసేనలో నిప్పు రాజుకున్నట్టయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ సిటీ నాయకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు, పవన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ వెనువెంటనే, పోటీ నుంచే తప్పుకుంటున్నామని బాంబ్ పేల్చారు పవన్. బీజేపీకి మద్దతిస్తున్నామని, ప్రచారానికి కూడా వస్తామన్నారు. కానీ రాలేదు. బీజేపీ నేతలు పిలవలేదో, హర్ట్‌ అయిన పవనే రాకూడదని నిర్ణయించుకున్నారో కానీ, మొత్తానికి జనసేన అధినేత గ్రేటర్ క్యాంపెయిన్‌లో అడుగుపెట్టలేదు. మరి పవన్ రాకపోవడం బీజేపీకి ప్లస్సయ్యిందా మైనస్ అయ్యిందా ఫలితాలు చెబుతున్నదేంటి?

బల్దియా పీఠాన్ని బీజేపీ గెలవకపోయినా, గెలిచినంత పని చేసింది. ఎన్నో రెట్లు పుంజుకుంది. టీఆర్ఎస్‌కు పోటీనిచ్చింది. ప్రత్యామ్నాయం తామేనన్న సీన్ క్రియేట్ చేసింది. అయితే, ఒకవేళ పవన్‌ బీజేపీకి ప్రచారం చేసి వుంటే, పరిస్థితి ఎలా వుండేదన్నదానిపై చర్చ జరుగుతోంది. పవన్ వచ్చి వుంటే, బీజేపీకి మేయర్ పీఠం సాధించేంతగా సీట్లు వచ్చేవని జనసైనికులు అంటుంటే, ఇప్పుడొచ్చిన సీట్లు కూడా దక్కేవికావని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు కమలనాథులు. ఆంధ్రానాయకుడిగా ముద్రపడిన పవన్, గ్రేటర్‌లో క్యాంపెయిన్‌‌ చేసివుంటే, బీజేపీకి ఇబ్బందిగా మారేదంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు నిద్రాహారాలు మానేశానని పవన్ గతంలో చెప్పుకోవడంతో, కొంత డిఫెన్స్‌లో పడింది కమలం. పొత్తు కుదిరితే, టీఆర్ఎస్‌కు ఈజీ టార్గెట్ అయ్యేవారమని భావించింది. అందుకే చాకచక్యంగా జనసేనను పోటీ నుంచి తప్పించడంతో పాటు పవన్‌ను ప్రచారానికి పిలవకుండా వ్యూహాత్మక మౌనం పాటించింది. క్యాంపెయిన్‌కు పవన్ రాకపోవడమే తమకు మేలు చేసిందన్నది బీజేపీ నేతల మాట. కానీ జనసైనికులు మాత్రం అలా అనడం లేదు. పీఠాన్ని చేజిక్కించుకునేవారమని అంటున్నారు. ఎవరి వాదన వారిదే.

Tags:    

Similar News