కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రభావం ఇంకా ఉందా.. రేవంత్‌రెడ్డిపై అలిగిన నేతలను ఆయనే దారికి తెచ్చారా?
KVP Ramachandra Rao: కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రభావం ఇంకా ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఆయన మళ్లీ చెలరేగుతారా?
KVP Ramachandra Rao: కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రభావం ఇంకా ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఆయన మళ్లీ చెలరేగుతారా? తెలంగాణ కాంగ్రెస్‌లో తన హవా నడిపించబోతున్నారా? ఇటీవల రేవంత్‌రెడ్డిపై అలిగిన నేతలను ఆయనే దారికి తెచ్చారా? బుజ్జగించి ఊరడించారా? ఇదంతా ఆయనతోనే సాధ్యం అవుతుందని హస్తం నేతలు కూడా అనుకుంటున్నారా? సీనియర్లను సముదాయించడానికి రేవంత్‌రెడ్డికి సహకరించింది ఆయనేనా? ఇంతకీ ఎవరాయన?
కేవీపీ రామచంద్రరావు. వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన నాయకుడు. ఆయన ఇప్పుడు మరోసారి హవా నడిపించబోతున్నారట. కేవలం ఆయన మాట మీదే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు దారికి వచ్చారట. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడానికి ముందు నుంచీ గుర్రు మీద ఉన్న సీనియర్లు కేవీపీ మాట మీదే ఒక్కసారిగా సైలెంటయ్యారన్న చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ ప్రకటన తర్వాత రోజులు రోజు రేవంత్ రెడ్డి అనుచరులు ఫోన్ చేస్తే కనీసం అందులోనూ పలకని కాంగ్రెస్ సీనియర్లు ఆయన బాధ్యతల స్వీకరణ సమయానికి సైలెంటు అవడం వెనుక కేవీపీ హస్తం ఉండి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మినహా కేవీపీ మీద గౌరవంతో అందరూ హజరయ్యారు. కానీ వీళ్లందరినీ అంతలా మెత్తబరచడానికి కేవీపీ ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించారోనని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
పీసీసీ చీఫ్‌గా తనను ప్రకటించిన తరువాత రేవంత్‌రెడ్డి అందరినీ కలుపుకుపోవడానికి ప్రయత్నించారు. స్వయంగా తానే సీనియర్లందరి ఇళ్లకు వెళ్లారు. అయినా సీనియర్లు కొందరు మాత్రం ససేమిరా అన్నారట. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే రేవంత్‌కు దూరంగానే ఉంటున్నామని చెప్పినట్టు ప్రచారం జరిగింది. కానీ అంతలో ఏమైందో ఏమో కానీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు మాత్రం రేవంత్ ప్రమాణస్వీకారానికి ఒక్కరోజు ముందు సడన్‌గా మెత్తబడ్డారు. అంతకుముందు సీరియస్‌గా ఉన్న ఈ సీనియర్లను రేవంత్ ఎలా దారికి తెచ్చుకొని ఉంటారన్న ఆసక్తి పార్టీలో కనిపించింది. కానీ దీని వెనుక కేవీపీ రామచంద్రరావు హస్తం కచ్చితంగా ఉందన్న సమాచారం ఆలస్యంగా తెలసి ఆశ్చర్యపోయిందట క్యాడర్.
వైఎస్ ప్రభుత్వంలో, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తన సత్తా చాటి తన హవాను నడిపించుకొని అంతటా చక్రం తిప్పిన కేవీపీని కలసి సంగతేంటో చెప్పడం వల్ల కేవీపీ వెంటనే రెస్పాండ్ అవడం వల్ల సీనియర్లు మెత్తపడి ఉంటారన్న చర్చ జరుగుతోంది. నిజానికి రేవంత్‌పై అలిగినే నేతలందరూ రాజకీయ గురువుగా భావిస్తారు. అలిగిన నేతలను అలర్ట్ చేయాలంటే కేవీపీయే బెటరన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ ఆయన్ను రంగంలో దించినట్లు తెలుస్తోంది. అందుకే కొన్నాళ్ల నుంచి గాంధీభవన్ మెట్లెక్కని కేవీపీ రేవంత్ ప్రమాణ స్వీకారం రోజు గాంధీభవన్ వచ్చి ఉంటారని చెప్పుకుంటున్నారు. ఏమైనా కేవీపీని చివరి అస్త్రంగా ప్రయోగించిన రేవంత్ మిగిలిన వారిని ఎలా దారికి తెచ్చుకుంటారో చూడాలి మరి.