Increased Oxygen Consumption: పెరిగిన ఆక్సిజన్ వినియోగం.. మూడు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు

Increased Oxygen Consumption: కరోనా కేసులు పెరుగుతుంటే దానికి తగ్గట్టు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Update: 2020-08-04 03:00 GMT
Oxygen Cylinders

Increased Oxygen Consumption: కరోనా కేసులు పెరుగుతుంటే దానికి తగ్గట్టు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది... తొలుత పదుల సంఖ్యలో ఉండే కరోనా కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. వీరందరికీ చికిత్స అందించాలంటే దానికి తగ్గ ఏర్పాట్లు ఉండాలి. దీనిలో భాగంగా కరోనా పేషెంట్ల పరిస్థితి తీవ్రమైతే వెంటిలేటర్ వాడి, ఆక్సిజన్ అందిస్తుంటారు. ఇలాంటి కేసులు ఎక్కువ కావడంతో దాంతో పాటు ఆక్సిజన్ వాడకం పెరుగుతూ వస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు ఉన్న సింగిల్ లైన్ వ్యవస్థను మరింత విస్తరించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా పాజిటివ్‌ రోగుల్లో ఎక్కువ మందికి ప్రాణవాయువు అవసరమవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతమున్న ఒక్క లైన్‌ ఆక్సిజన్‌ వ్యవస్థను మూడు లైన్లుగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారీ దవాఖానల్లో చేరుతున్న కొవిడ్‌ రోగులకు అధిక స్థాయిలో ప్రాణ వాయువు కావాల్సి వస్తోందని, గతంతో పొల్చితే ఆక్సిజన్‌ వినియోగం 4 రెట్లు పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఆక్సిజన్‌ పడకలు 30 శాతం.

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 80 శాతం మంది హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. మిగిలిన 20 శాతం మంది వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వారిలో 3 శాతం మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం 17080 పడకలు ఏర్పాటు చేయగా అందులో 4663 ఆక్సిజన్‌ పడకలు. 1251 ఐసీయూ పడకలు. అంటే 70 శాతం పడకలు ఆక్సిజన్‌ లేనివి కాగా.. 30 శాతమే ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి ఇప్పటికే 50 శాతం ఆక్సిజన్‌ పడకలు ఏర్పాటు చేయాల్సి ఉందని, మున్ముందు పెరిగే పాజిటివ్‌ల శాతం మేరకు ఉన్నవన్నింటినీ 100 శాతం ఆక్సిజన్‌ పడకలుగా మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

పెరిగిన ఆక్సిజన్‌ వాడకం..

దేశవ్యాప్తంగా రోజూ 1500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది జూలై 15 నాటి లెక్క. అలాగే మనదేశంలో 15 వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను రిజర్వ్‌లో ఉంచారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసుల సంఖ్య భారీగా ఉంది. అనధికారికంగా లక్షన్నర పాజిటివ్‌ కేసులున్నట్లు రోగులకు కేటాయిస్తున్న ఐడీలను బట్టి తేలింది. కానీ, అధికారిక లెక్కల ప్రకారం 66 వేలే చూపుతున్నారు. ప్రస్తుతం మనదగ్గర రోజుకు 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వాడకం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా కేసులు ప్రారంభ దశలో రోగుల కోసం ఒక్క లైన్‌ వ్యవస్థతో యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోగుల సంఖ్య భారీగా పెరగడం, ఆస్పత్రికి వచ్చేవారిలో ఎక్కువ మందికి ఆక్సిజన్‌ అవసరమవుతుండడంతో గతంలో ఏర్పాటు చేసిన ఒక్క లైన్‌ వ్యవస్థ సరిపోవడం లేదు. దీంతో మూడు లైన్ల వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ వ్యవస్థలో ఒక దాంట్లో ఆక్సిజన్‌, మరో దాంట్లో సక్షన్‌, మూడో దాంట్లో నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవస్థతో రోగులకు మరింత సౌకర్యవంతంగా ఆక్సిజన్‌ అందించవచ్చని అంటున్నారు. కాగా ఇప్పటికే సిలిండర్ల స్థానంలో క్రయోజనిక్‌ లిక్విడ్‌ ట్యాంకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో 25 శాతం ఆక్సిజన్‌ ఉండగానే అప్రమత్తం చేస్తుంది. ప్రస్తుతమున్న సింగిల్‌ లైన్‌ వ్యవస్థ వల్ల రోగులకు తగినంత స్థాయిలో ఆక్సిజన్‌ అందడం లేదు. అందుకే మూడు లైన్లుగా మార్చేందుకు రంగం సిద్ధం చేశారు. గాంధీలో ఉన్న ఆక్సిజన్‌ పడకల్లో మరో 500 పడకలను త్రిబుల్‌ లైన్‌గా మార్చేందుకు పనులు ప్రారంభించారు. మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఇదే విధంగా మార్చాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సింగిల్‌ వ్యవస్థను అన్ని చోట్ల మూడు లైన్లుగా మార్చడం సాధ్యం కాదని అంటున్నారు.

Tags:    

Similar News