అంతా బంగారమే.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే రూ. 40 కోట్ల విలువైన గోల్డ్ సీజ్
పార్లమెంట్ ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న బంగారం
పార్లమెంట్ ఎన్ని్కల వేళ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. సోదాల్లో ప్రతి రోజూ ఏదో ఒక చోట భారీగా నగదు, బంగారం పట్టుబడుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లో 23 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వెండిని పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీలు చేపట్టగా రెండు వాహనాల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తోన్న 34 కిలోల బంగారు నగలు, 43 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌కార్గో ద్వారా తరలించినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు.
ఇక ఏపీలోనూ భారీగా బంగారం పట్టుబడింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తోన్న 17 కోట్ల రూపాయల విలువైన బంగారం సీజ్ చేశారు. గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఈ బంగారం పట్టుబడింది. అయితే ఏప్రిల్ 13న ఇదే వాహనంలో మూడు కోట్ల రూపాయల విలువైన బంగారం పట్టుకున్నట్లు గుర్తించారు. కాగా సీజ్ చేసిన బంగారం సహా వాహనాన్ని కాకినాడ ట్రెజరీ కార్యాలయానికి తరలించారు.