Hyderabad Youth Voluntary Services in Corona Pandemic: కరోనా మృతుల అంతిమ సంస్కారాల్లో హైదరాబాద్ యువత స్వచ్చంద సేవ!
మానవత్వానికి మనుగడకు జరుగుతున్న యుద్ధంలో ఎన్నో కరోనా మృతదేహాలు అనాథ శవాలుగా మిగులుతున్నాయి. అంత్యక్రియలకు కాదు కదా కనీసం చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు. అలాంటి కరోనా మృతదేహాలపై కరుణ చూపిస్తున్నారు కొందరు యువకులు కరోనా మృతదేహాలను కాటి వరకు చేర్చి శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా మృతదేహాల తరలించాలనే ఆలోచన వీరికి ఎందుకు ఏ ఘటనే వీళ్లను ప్రేరేపించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మృతదేహాలపై కరుణ కరువైంది. సొంత కుటుంబసభ్యులు సైతం మృతదేహాలను తీసుకువెళ్లేకు ధైర్యం చేయడం లేదు. ఒకవేళ ముందుకు వచ్చినా ఆంబులెన్స్, అంత్యక్రియల ఖర్చులు పేదవాళ్లు భరించలేదు. ఇలాంటి సందర్భంలో సర్వ్ ద నీడి అనే సంస్థ సభ్యులు ముక్కుముఖం తెలియని కరోనా మృతదేహాలకు ఉచితంగా అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. పోలీసుల సహకారంతో కాటి వరకు చేర్చి అంతిమసంస్కరాలు నిర్వహిస్తున్నారు.
ఈ యువకులకు ఈ అద్భుత ఆలోచన రావడానికి కారణం లేకపోలేదు. తన స్నేహితుడికి ఏర్పడిన పరిస్థితి వారిని ఆలోచింపజేసింది. పేదవాళ్లకు ఇబ్బంది కలుగకుండా కరోనా మృతదేహాలను సంప్రదాయ పద్ధతిలో పంపించాలని నిర్ణయించారు. లాస్ట్ రైడ్ పేరుతో ఆంబులెన్సును సర్వీస్ ఏర్పాటు చేసి ఉచితంగా అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల సహకారంతో కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఈ సేవలు అందిస్తున్నట్లు ఆ యువకులు చెబుతున్నారు. అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా ధైర్యంగా కరోనా మృతదేహాలకు గౌరవంగా అంతిమసంస్కారాలు నిర్వహించాలని కోరుతున్నారు. కరోనా మృతదేహంతో వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యులు అన్ని ఏర్పాట్లు చేస్తారని చైతన్యం కల్పిస్తున్నారు.
లాస్ట్ రైడ్ వాహనాలను నడిపించేందుకు డ్రైవర్లు, మరికొంతమంది సహయకులను ఏర్పాటు చేశారు. వారికి పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందజేస్తున్నారు. ముఖ్యంగా వీరికి ఇన్సూరెన్సు కూడా చేయించారు. ఇది ఒక్కటే కాదు ఈ సంస్థ ద్వారా లాక్ డౌన్ సమయంలో యువ టెకీలు ఎంతో మంది కడుపు నింపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సేవలు అత్యంత అవసరం. ప్రభుత్వానికి, అధికారులకు, కుటుంబాలకు పెద్ద సవాలుగా మారిన అంత్యక్రియల నిర్వహణను వీరు ధైర్యంగా చేయడం గర్వించదగ్గ విషయం.