Reduction of Power Charges : జలమండలికి తగ్గనున్న కోట్ల భారం..
Reduction of Power Charges : ఎన్నో ఏళ్ల నుంచి అధిక విద్యుత్ చార్జీల భారంతో జలమండలి సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Reduction of Power Charges: ఎన్నో ఏళ్ల నుంచి అధిక విద్యుత్ చార్జీల భారంతో జలమండలి సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అధిక విద్యుత్ చార్జీలను తగ్గింపు జరిగింది. దీంతో జలమండలికి ఈ భారం నుంచి విముక్తి లభించింది. భారీ మోటర్ల వినియోగం, రిజర్వాయర్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా మూడు ఫేజ్‌లు, గోదావరి ఒక ఫేజ్ ద్వారా నగరానికి తాగునీటిని తీసుకువస్తున్నారు. అంతే కాక నగరం అంతటా సరఫరా చేస్తున్నారు. నగరంలోని వినియోగదారులకు ఈ మంచి నీటిని సరఫరా చేయడానికి ప్రతి నెలకు సుమారుగా 200 నుంచి 225 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మహానగరానికి జలమండలి సరఫరా చేస్తున్న ఈ నీటిలో 95 శాతం వరకు గృహావసరాలు తీరుతున్నాయి. విద్యుత్ చార్జీల రూపంలో రూ.90 కోట్లను చెల్లిస్తున్నారు. దీంతో ఇంత మొత్తంలో వస్తున్న విద్యుత్ బిల్లుల్లో రాయితీలు కల్పించాలని జలమండలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఇక ఈ విషయంపై స్పందించిన కేటీఆర్ ఈ సమస్యనుల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కూడా విద్యుత్ బిల్లులను తగ్గించడానికి ఒప్పుకున్నారు. ఇందులో భాగంగానే జీవో నెం.148ని 2018 ఆగస్టు 3న జలమండలి టారీఫ్ తగ్గించాలని విడుదల చేశారు. విద్యుత్ శాఖ యాక్ట్ 108/2003 ప్రకారం ఈ రాయితీలు కల్పించారు. తాజాగా ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని కేటగిరీలో ప్రతి యూనిట్‌కి రూ.3.95 చొప్పున వసూలు చేయనున్నారు. రాయితీ లేకముందు నెలకు దాదాపుగా రూ.90 కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో చెల్లించేవారు. ఇక ఈ తగ్గింపు వలన జలమండలికి రూ.700 కోట్లు మిగలనున్నాయి. ప్రతినెలా జలమండలికి దాదాపుగా రూ.22.5 కోట్లు ఆదా కానుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.270 కోట్ల భారం తప్పనుంది. ఇంతకుముందు జలమండలికి 11కేవీ విద్యుత్‌కి రూ.6.65, 33 కేవీ విద్యుత్‌కి రూ.6.15, 133 కేవీ, ఆపైన విద్యుత్‌కి రూ.5.65లు యూనిట్‌కి చొప్పున వసూలు చేసేవారు. రాయితీ అనంతరం నెలకు దాదాపుగా రూ.22.5 కోట్లు ఆదా కానున్నాయి. జలమండలికి విద్యుత్ టారీఫ్‌లో రాయితీ కోసం కృషి చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు జలమండలి ఎండీ ఎం.దానకిషోర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.