Hyderabad Orr: ఓఆర్ఆర్‌పై టోల్ ఛార్జీల పెంపు

Hyderabad Orr: ఓఆర్ఆర్‌పై వసూలు చేసే టోల్ ఛార్జీలను 3.5శాతం పెంచుతూ హెచ్‌జీసీఎల్ నిర్ణయం తీసుకుంది.

Update: 2021-04-16 05:28 GMT

Hyderabad Orr:(File Image)

Hyderabad Orr: మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు అసలే కరోనా తో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్థ అయి ఆర్థిక భారంతో అల్లాడుతుంటే మరోవైపు తమ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి టోల‌్ ఛార్జీల పెంపు మరవక ముందే హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌‌పై వసూలు చేసే టోల్ ఛార్జీలను 3.5శాతం పెంచుతూ హెచ్‌జీసీఎల్(హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ) నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుదలతో ప్రతి కిలోమీటర్‌కు 6పైసల నుంచి 39 పైసల వరకు టోల్‌ఛార్జీ పెరగనుంది. ఔటర్‌ రింగు రోడ్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న హెచ్‌జీసీఎల్‌‌కు జీవో నం. 365 క్లాజ్‌ 5 ప్రకారం నెహ్రూ ఔటర్‌ రింగు రోడ్డు టోల్‌ రూల్స్‌-2012ను ప్రకారం ఏటా కొంత మేర టోల్‌ ఛార్జీలు పెంచేందుకు అవకాశం ఉంది.

హైదరాబాద్ మహానగరం చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఓఆర్‌ఆర్‌పై రోజూ 1.20 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. టూ టైర్, త్రీ టైర్ వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలు ఓఆర్‌ఆర్‌పై రాకపోకలు సాగించవచ్చు. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఓఆర్ఆర్‌పై రాకపోకలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా ఓఆర్‌ఆర్‌ చుట్టూ హెచ్‌ఎండీఏ రకరకాల అభివృద్ధి పనులను చేపడుతోంది. ముఖ్యంగా వాహనదారులకు ఆహ్లాదం కలిగించేలా ఓఆర్ఆర్‌కి ఇరువైపులా, మధ్యలో లక్షలాది మొక్కలు నాటింది. వీటి నిర్వహణకే ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పెరిగిన చార్జీలు నేటి(శుక్రవారం) నుంచి అమలులోకి వచ్చాయి.

Tags:    

Similar News