జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు రంగం సిద్ధం

Update: 2021-01-23 08:04 GMT

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. ఉద‌యం 11 గంట‌ల‌కు కొత్త కార్పోరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారని ఎస్‌ఈసీ పార్థసారధి వెల్లడించారు. ఒకవేళ ఆ రోజు డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించలేకపోతే మరుసటి రోజు నిర్వహిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ను ఎస్‌ఈసీ నియమించింది.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను మేజిక్‌ ఫిగర్‌తో సంబంధం లేకుండా చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం కార్పొరేటర్లు 150 మంది ఉన్నారు. అలాగే ఎక్స్‌ అఫీషియో సభ్యులు 45 మంది ఉన్నారనుకుంటే మొత్తం సభ్యుల సంఖ్య 195 అవుతుంది. సమావేశానికి కనీసం సగం మంది అంటే 98 మంది సభ్యులు హాజరుకావాలి. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వారే మేయర్‌గా ఎన్నికవుతారు. ఇదే పద్ధతిలో డిప్యూటీ మేయర్‌ను కూడా ఎన్నుకుంటారు.

గత ఏడాది డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తై నెలరోజులు దాటినా మేయ‌ర్ ఎన్నిక‌ జ‌ర‌గ‌లేదు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పోరేటర్లు ప్రగతిభవన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక ఇటీవలే కొత్త కార్పోరేటర్లు ఎన్నికైనట్టుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఈసీ జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది.

Full View



Tags:    

Similar News