Containment Zones in Hyderabad: హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్‌డౌన్ ఉన్నట్లా.. లేనట్లా..?
Containment Zones in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అత్యధిక స్ధాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలోనే కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.
Containment Zones in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అత్యధిక స్ధాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలోనే కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మళ్లీ లాక్ డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో ఈ విషయమై చర్చిస్తామన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే నగరంలో మరోసారి లాక్‌డౌన్ అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తుండటమే దీనికి కారణం. నగరంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వారు నివాసం ఉంటున్న ఇంటిని మాత్రమే కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నారు. ఈ విధంగా అధికారులు కరోనా పేషెంట్లను హోం క్వారంటైన్లో ఉంచినప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. సరైన సమయానికి వైద్య సిబ్బంది, అధికారులు పర్యవేక్షించకపోవడంతో కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలోని ఇతర సభ్యులు బయటకు వెళ్తున్నారు. అలాంటి వారే కరోనా క్యారియర్స్ గా మారి వీరి ద్వారా ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోంది.
ఈ క్రమంలోనే నగరంలో పర్యటించిన కేంద్రం బృందం. కాంటాక్టులను గుర్తించడం, కంటైన్మెంట్‌లను పకడ్బందీగా కొనసాగించాలని సూచించింది. ఇందులోభాగంగానే వచ్చే రెండు నెలలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించింది. అదే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు నగర పరిధిలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది. ఏప్రిల్ నుంచి అన్‌లాక్ దశ ప్రారంభమయ్యే వరకు రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఐదు కంటే ఎక్కువ కేసులున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తారు. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. కానీ తర్వాత ఇళ్లను మాత్రం కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటిస్తుండటంతో ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 800 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా.
ఇక పోతే బుధవారం రాష్ట్రంలో 1924 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు. ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే 1590 కేసులొచ్చాయి. ఇక మిగిలిన జిల్లాల్లో రంగారెడ్డి 99,మేడ్చల్ 43,సంగారెడ్డి 20, కరీంనగర్ 14, మహబూబ్ నగర్ 15, కామారెడ్డి 3, నల్గొండ 13, వరంగల్ రురల్ 26, వరంగల్ అర్బన్ 7, నిజామాబాద్ 19, వికారాబాద్ 11, మెదక్ 5, పెద్దపల్లి 5, సూర్యాపేట 7, ఖమ్మం 4, జగిత్యాల 3, భద్రాద్రి కొత్తగూడెం 5, రాజన్న సిరిసిల్ల 13, ఆదిలాబాద్ 3, ఆసిఫాబాద్ 1, నగర్ కర్నూల్ 3, వనపర్తి 9, యాదాద్రి 5, నారాయణపేట 1. ఉన్నాయి. మరోవైపు కొత్తగా 992 మంది కోలుకున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29 వేల 536 కి చేరింది. ఇందులో 17 వేల 279 మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 11 వేల 933 యాక్టీవ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 324 మంది కరోనా తో చనిపోయారు.