హైదరాబాద్‌లో ఘనంగా సదర్ వేడుకలు
దీపావళి అంటే హైదరాబాద్ వాసులకు మరో వేడుక ఠపీమని గుర్తొస్తుంది. అదే సదర్ ఉత్సవం. దేశంలో ఎక్కడా జరగని విధంగా కేవలం భాగ్యనగరానికే పరిమితమైన సదర్ ఉత్సవం చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.
దీపావళి అంటే హైదరాబాద్ వాసులకు మరో వేడుక ఠపీమని గుర్తొస్తుంది. అదే సదర్ ఉత్సవం. దేశంలో ఎక్కడా జరగని విధంగా కేవలం భాగ్యనగరానికే పరిమితమైన సదర్ ఉత్సవం చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. హైదరాబాద్ మహా నగరంలో జరిగే ఎన్నో పండుగల మాదిరిగా సదర్‌కు కూడా చాలా ప్రత్యేకత ఉంది. దీపావళి పండుగ మరునాడు యాదవ సోదరులు జరుపుకునే సదర్ ఉత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఈసారి కూడా నగరంలో పలుచోట్ల జరిగిన సదర్ వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సదర్ ఉత్సవం వృషభ రాజుల పండుగ. హైదరాబాద్‌లో ఈ ఉత్సవం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీపావళి పండుగ మరునాడు యాదవ సోదరుల ఆధ్వర్యంలో జరిగే సదర్ ఉత్సవం ఎంతగానో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్‌లో తప్ప మరెక్కడా కనిపించని సదర్ ఉత్సవం యాదవ సోదరులకు ప్రీతి పాత్రమైన పండగ. వృషభ రాజులను అందంగా అలంకరించి వాటితో యాదవ సోదరులు కుస్తీ పట్టే తీరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఇదివరకు సదర్ ఉత్సవం అంటే నారాయణ గూడ ప్రాంతం ఒక్కటే గుర్తుకొచ్చేది. అంత బాగా సదర్ ఉత్సవాలు ఈ ఏరియాలో జరుగుతాయి. ఇప్పటికీ కూడా నగరంలోని పలుచోట్ల సదర్ వేడుకలు నిర్వహించినప్పటికీ.. నారాయణగూడలో జరిగే సదర్ ఉత్సవాలకే అధిక ప్రాధాన్యత దక్కుతోంది. పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల నుంచి భారీ శరీరం కలిగిన వృషభరాజాలను తీసుకొచ్చి సదర్ ఉత్సవాలకు మరింత వన్నెలద్దుతున్నారు.
సదర్ వేడుకల సందర్భంగా అందంగా అలంకరించిన వృషభ రాజులతో యువకులు కుస్తీ పడ్డారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా వేసే తీన్మార్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాచిగూడ చప్పల్ బజార్‌లో కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్, నారాయణగూడలో జరిగిన వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వృషభాలను అందంగా అలంకరించిన పలువురు యాదవ సోదరులకు బహుమతులను అందించారు. యాదవుల ఐక్యతను చాటి చెప్పేవిధంగా ఈ సదర్ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి తలసాని చెప్పారు.
దేశంలో వివిధ రాష్ట్రాల్లోని మేలుజాతి దున్నలతో నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. భాగ్యనగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం ఈ వేడుకలు చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు.