Ganesh Nimajjanam 2023: భాగ్యనగరంలో నిమజ్జనాల కోలాహలం.. ఘనంగా గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర
Ganesh Nimajjanam 2023: హైదరాబాద్‌లో 74 ప్రాంతాలకు పైగా నిమజ్జనాలకు ఏర్పాట్లు
Ganesh Nimajjanam 2023: భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. గణనాథుల శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ బాజాలతో దద్దరిల్లుతుండగా.. భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర జరుగుతోంది. నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడే కనిపిస్తోంది.
భాగ్యనగరం నలువైపులా మొత్తం 74 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ప్రధాన చెరువులు, జంట జలాశయాలు, హుస్సేన్ సాగర్‌తో పాటు బేబీ పాండ్‌లలో నిమజ్జనాల ఏర్పాట్లు చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ ఎత్తున క్రేన్లు ఏర్పాటు చేశారు. కేవలం హుస్సేన్ సాగర్ దగ్గరే 34 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 14, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 10 క్రేన్లు నిమజ్జనాల కోసం ఉంచారు. క్రేన్ల దగ్గర పనిచేసైసేందుకు ప్రత్యేకంగా వెయ్యి మంది ఎంటమాలజీ సిబ్బందిని నియమించారు. నిమజ్జన ప్రాంతాల దగ్గర డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను సిద్ధం చేసి ఉంచారు. నగరం మొత్తం 354 కిలోమీటర్ల మేర నగరంలో గణపతి విగ్రహాల శోభాయాత్రలు జరగనున్నాయి.
బాలాపూర్ నుంచి చార్మినార్ మీదుగా.. హుస్సేన్‌సాగర్ వరకు గణేశుని శోభాయాత్ర జరగనుంది. భక్తుల కోసం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు అధికారులు. వాటర్ ప్యాకెట్ల పంపిణీకి 122 స్టాల్స్ ఏర్పాటు చేశారు. నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా 3 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.
200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను సిద్ధం చేశారు. 37 హెల్త్ క్యాంప్‌లు, 15 ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిమజ్జనాలు జరిగే ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నగరం మొత్తం 40 వేల మంది పోలీసులతో పహారా సిద్ధం చేశారు. 20 వేలకు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
ఇక ఖైరతాబాద్ మహా గణపతికి అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించింది ఉత్సవకమిటీ. ఆ తర్వాత భారీ వాహనంపైకి మహా గణపతిని చేర్చారు. ఉదయం 7 గంటల నుంచి మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మహా గణపతి శోభాయాత్రను తిలకించేందుకు భారీగా భక్తులు చేరుకున్నారు. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా..ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. ఉదయం 9.30కి క్రేన్ నెంబర్-4 వద్ద మహాగణపతి తొలగింపు కార్యక్రమం చేపడతారు. 11 గంటల 30 నిమిషాల నుంచి హుస్సేన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవనుండగా.. 12 గంటలకి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.
గణేష్ నిమజ్జనం కోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం 535 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మరోవైపు మెట్రోరైల్ సేవలను కూడా అర్ధరాత్రి వరకు పొడిగించారు. మూడు కారిడార్లలో అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఖైరతాబాద్, లక్డికాపూల్‌లో రద్దీ ఎక్కువగా ఉండే చాన్స్ ఉండటంతో.. భక్తుల భద్రత దృష్ట్యా ఆ రెండు మెట్రో స్టేషన్లలో ప్రైవేట్ భద్రతను పెంచనున్నారు మెట్రో అధికారులు.