దూకుడు పెంచిన రాజకీయ పార్టీలు.. శాంతి భద్రతల అంశాన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు
జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే విధంగా ముందుకు వెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పదునైన విమర్శనాస్త్రాలతో పార్టీలు దూసుకెళ్తుంటే శాంతి భద్రతల అంశం పోలీసులకు సవాల్‌గా మారింది. గ్రేటర్ పోల్‌కు పోలీసులు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారనే అంశం ఆసక్తిగా మారింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక విజయం జోష్‌తో బీజేపీ దూసుకెళ్తోంది. ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్న టీఆర్ఎస్ బీజేపీ దూకుడుకు కళ్లం వేయడానికి కసరత్తు చేస్తోంది. ఇక ఎంఐఎం యధావిధిగా తమ ప్రాంతాల్లో పాగ వేసేందుకు సిద్ధమైంది. గెలుపు కోసం అన్ని పార్టీలు కత్తులు నూరుతుండటంతో భద్రత అంశాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. పాత బస్తీ ఏరియా పోలీసులకు తల నొప్పిగా మారే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తుండటంతో బందోబస్తుకు కార్యచరణ మొదలు పెట్టారు.
ఎన్నికల సన్నద్ధతపై హైదరాబాద్ కమిషనరేట్ పోలీస్ సిబ్బందితో సీపీ అంజని కుమార్ సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎలా మెలగాలి అనే అంశంపై పోలీస్ సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధాలు సమర్పించే విషయంలో ఈ సారి కూడా సిబ్బందికి సూచనలు ఇచ్చామని సీపీ తెలిపారు. మొత్తంగా గెలుపు కోసం పార్టీలు కసరత్తు చేస్తుంటే ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.