బోనమెత్తనున్న భాగ్యనగరం.. జులై 7న గోల్కొండ బోనాలతో ప్రారంభం
Ashada Bonalu: తొలకరి వానలు పడగానే.. అమ్మలగన్న అమ్మలకు బువ్వ పెట్టే ఆచారమే బోనం. ఈ బోనం తొలుత భాగ్యనగరంలో ప్రారంభమై ఆ తర్వాత తెలంగాణ అంతటా విస్తరిస్తుంది.
Ashada Bonalu: తొలకరి వానలు పడగానే.. అమ్మలగన్న అమ్మలకు బువ్వ పెట్టే ఆచారమే బోనం. ఈ బోనం తొలుత భాగ్యనగరంలో ప్రారంభమై ఆ తర్వాత తెలంగాణ అంతటా విస్తరిస్తుంది. అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవానికి జంట నగరాలు సిద్ధమవుతున్నాయి. ప్రతి ఏటా ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటపై వెలసిన శ్రీఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఆషాడమాసం జూలై 5న వస్తుంది. తర్వాత వచ్చే జులై 7 నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తొలి పూజల్ని జగదాంబిక అమ్మతో ప్రారంభించిన తర్వాత మిగతా హైదరాబాద్ అంతా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో పూజలు జరుగుతాయి. ఆషాడ మాసంలో చివరిరోజున మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. జూలై 7 నుంచి నెల రోజుల వరకు ప్రతి గురువారం, ఆదివారం బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు మూడో వారం అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే రంగం వేడుకను తెలంగాణ అంతటా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.