Huzurabad By Elections 2021: హుజూరాబాద్ ఎన్నికల నామినేషన్ల దాఖలూ నేటి నుంచే
Huzurabad By Elections 2021: *ఈనెల 8న నామినేషన్ దాఖలుకు చివరి తేదీ *ఈనెల 11న నామినేషన్ల పరిశీలన
Huzurabad By Elections 2021: హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. బై ఎలక్షన్‌కు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలు కూడా ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా.. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్.
ఇక టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీ-ఫాం అందజేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ పడుతుడంగా ఇంత వరకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈటల సతీమణి జమునను బరిలో నిలిపే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపికపై ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నోటిఫికేషన్, అదే విధంగా నామినేషన్ దాఖలు కూడా ప్రారంభం కానుంది.
హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డిని రిటర్నింగ్ అధికారిగా నియమించారు. అభ్యర్థులు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ సమయంలో ఎలాంటి ఊరేగింపులు, మీటింగ్‌లకు అనుమతి లేదని చెప్పారు. గతంలో ఇచ్చిన కొవిడ్ గైడ్‌లైన్స్ ప్రకారంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు వేసేవారు మూడు వాహనాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుందని చెప్పారు.