ఉప్పు-నిప్పు ఒక్కటైనట్టేనా.. కోమటిరెడ్డికి అధిష్టానం గట్టి హామి ఇచ్చిందా?
Revanth Reddy: ఉప్పు-నిప్పు కలుస్తుందా? ఉత్తరం-దక్షిణం ఏకమవుతుందా?
Revanth Reddy: ఉప్పు-నిప్పు కలుస్తుందా? ఉత్తరం-దక్షిణం ఏకమవుతుందా? ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా? నో ఛాన్స్. ఇవన్నీ జరిగే అవకాశమే లేదు. కానీ జరిగింది. నిజంగా అలాంటి మహాద్భుతంలాంటి సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పు-నిప్పులాంటి రేవంత్ రెడ్డి-కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ముసిముసి నవ్వులు రువ్వుకున్నారు. అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఇదంతా ఓకే. వీరిద్దరి మధ్య సంధి ఎలా కుదిరింది? ఎవరు సెట్ చేశారు? సయోధ్య వెనక జరిగిన మంత్రాంగం ఏంటి?
ఎంత చూడచక్కగా వుంది కదా దృశ్యం అనుకుంటున్నాటర హస్తం కార్యకర్తలు. నువ్వానేనా అంటూ డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్టుగా కత్తులు దూసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు చాలాకాలం తర్వాత కలిశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడైన తర్వాత, ముఖాముఖి కలుసుకున్నది బహుశా ఇదే ఫస్ట్ టైమ్. వరిధాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం కొనాలంటూ ఇందిరా పార్క్ దగ్గర పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన వరి దీక్షలో, ఇరువురు నేతలు కలుసుకున్నారు. కోమటిరెడ్డిని స్టేజి మీదకు రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పక్కపక్కనే నిలబడి ఫోటోలకు సైతం ఫోజులిచ్చారు. దీక్షా వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. వేదికపైన అగ్ర నేతలు, వేదిక కింద కార్యకర్తలు కార్యకర్తలు, ఇది మహాద్భుత దృశ్యం, కనివిని ఎరుగని ఘట్టమంటూ కళ్లగప్పించి చూస్తూ తరించిపోయారు.
మొదటిసారి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నోటి నుంచి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ మాట బయటకు వచ్చింది. అటు రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి పేరును ప్రసంగంలో ప్రస్తావించారు. నిజంగా వీరు కలిసినట్టేనా? కలిసిపోయినట్టు నటించడమేనా? ఇక టీపీసీసీలో ఇద్దరి కోల్డ్‌వార్ ముగిసినట్టేనా? మరి ఇద్దర్నీ ఎవరు కలిపారు? సయోధ్య ఎవరు కుదిర్చారు? వీహెచ్ మంత్రాంగంతోనే ఫలించిందా? లేదంటే ఢిల్లీ దర్బార్ గట్టి వార్నింగ్ ఇచ్చిందా?
హుజూరాబాద్ బైపోల్ తర్వాత టీ కాంగ్రెస్‌లో తుపాను చెలరేగింది. రేవంత్ రెడ్డి వ్యతిరేకులంతా నోటికి పని చెప్పారు. గాంధీభవన్‌లో పెద్ద రచ్చయ్యింది. కోమటిరెడ్డి తీరుపై మాణిక్కం ఠాగూర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్, కోమటిరెడ్డి నడుమ సంధి కుదిర్చే బాధ్యతను సీనియర్ నేత వి. హనుమంత రావుకు అప్పగించారు. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. కోమటిరెడ్డిని సముదాయించారు. కలిసికట్టుగా సాగితేనే టీఆర్ఎస్‌పై పోరాడగలమని అధిష్టానం సందేశంగా కోమటిరెడ్డికి చెప్పారు. కోమటిరెడ్డి అభ్యంతరాలను సైతం మాణిక్కం ఠాగూర్‌కు వివరించారు వీహెచ్. ఆయన సైతం అన్నీ విని, అంగీకరించారట. దాంతో కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వివాదం సమసిపోయిందని స్వయంగా ప్రకటించారు వీహెచ్. అది అందరికీ తెలిసేలా, ఇందిపార్క్ దీక్షకు కోమటిరెడ్డిని రప్పించారు. ఇద్దరి నడుమ సయోధ్య కదిర్చిన ఘనత వీహెచ్‌దే.
కేవలం వీహెచ్ మాత్రమే కాదు, ఢిల్లీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి-కోమటిరెడ్డిల కోల్డ్‌వార్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. అసలే పార్టీ అష్టకష్టాల్లో వుందని, ఇలాంటి పరిస్థితుల్లో నేతల మధ్య సఖ్యత లేకపోతే, జనాలు ఎలా ఆదరిస్తారని ఇరువురితో విడివిడిగా మాట్లాడిందట హైకమాండ్. అంతేకాదు, పీసీసీ పదవి రానందుకు బాధపడొద్దని, ఫ్యూచర్‌లో గట్టి పోస్ట్ వస్తుందని చెప్పిందట. అటు వీహెచ్, ఇటు అధిష్టానం ఊరడింపులతో కూల్ అయ్యారట కోమటిరెడ్డి వెంకట రెడ్డి. అందుకే ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రేవంత్‌తో మాట కలిపారు. ఇరువురు నేతలూ, టీఆర్‌ఎస్‌పై విమర్శల జడివాన కురిపించారు.
మొత్తానికి తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగిన ప్రభావమో, లేదంటే ఒక్కటైతే తప్ప ఫైట్ చెయ్యలేమని గ్రహించారోగానీ, వరి దీక్ష వేదికగా, ఉప్పు, నిప్పులాంటి నేతలు కలిశారు. ఇది కాంగ్రెస్‌లో ఒక కీలక పరిణామంగానే భావించాలి. అందరం కలిసున్నామన్న సంకేతాలు పంపినట్టయ్యింది. మరి ఇదంతా కేవలం ఏక్ దిన్ కా సినిమానేనా? రాబోయే రోజుల్లో కలిసికట్టుగా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు ఉద్యమిస్తారా? చూడాలి, ఏమవుతుందో.