వరంగల్ నగరంలో అస్తవ్యస్తంగా రహదారులు.. ప్రమాదకరంగా మారిన కాలనీల్లోని రోడ్లు
warangal Roads : పేరుకే పెద్దనగరం.. వర్షం పడితే మాత్రం చిత్తడి అవుతున్న రోడ్లపై ప్రజలు నరకం చూస్తున్నారు. గుంతలమయం రోడ్లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.
warangal Roads : పేరుకే పెద్దనగరం.. వర్షం పడితే మాత్రం చిత్తడి అవుతున్న రోడ్లపై ప్రజలు నరకం చూస్తున్నారు. గుంతలమయం రోడ్లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపనలు చేసి పనులు పూర్తి చేయడం మర్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరం తరువాత రెండవ పెద్ద నగరం వరంగల్. ఇక్కడ వరంగల్, హన్మకొండ, కాజిపేట లు కలిసి ట్రై సిటీగా ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలు మాత్రం ఇక్కడ లేవు. ఇక వర్షాలు పడ్డాయంటే, రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారుతుంది.
కాజిపేట నుండి వరంగల్ కు ఉన్న ప్రధాన రహదారి మినహా మిగతా రోడ్లన్నీ అద్వాన్నంగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతా వేటు దూరంలో ఉన్న హన్మకొండ రెవెన్యూ కాలనీ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది.
ఇక్కడ రోడ్డు నిర్మాణం కోసం 2016లో శంకుస్థాపన చేసి మద్యలో ఒకే వరుస డివైడర్ వేసి వొదిలేసారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఈ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద గుంతలు పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
నగరం పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందని బెట్టర్ వరంగల్ సంస్థ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ అంటున్నారు. గడిచిన 20 ఏళ్లలో నగరం బాగా విస్తరించి జనాభ పెరిగినా, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని ఆరోపిస్తున్నారు.
నగరంలో ప్రజల విశ్వాసాల మేరకు పని చెయ్యాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు చేయకపోవడంతో రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయ్యాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వచ్చే గ్రేటర్ ఎన్నికల సమయానికి ఈ రోడ్ల గతిని మారుస్తారని ఆశిద్దాం.