నివర్ తుపానుతో వాతావరణంలో మార్పులు!

నివర్ తుపాను దెబ్బకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. కశ్మీర్‌ను మరిపించే చలితో ఉమ్మడి ఆదిలాబాద్ వణుకుతోంది.

Update: 2020-11-28 07:14 GMT

నివర్ తుపాను దెబ్బకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. కశ్మీర్‌ను మరిపించే చలితో ఉమ్మడి ఆదిలాబాద్ వణుకుతోంది. ఓ వైపు శీతల గాలులు, ‌మరోవైపు చలి తీవ్రత.. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు ప్రజలు. తెలంగాణ కశ్మీర్ ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలిపై HMTV స్పెషల్ రిపోర్ట్..

నివర్ తుపాను వల్ల ఒక్కసారిగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు సంభవించాయి. కొమురం భీమ్ జిల్లా గిన్నేదరి, బేల మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణుకుతున్నారు. ఇంట్లో నిలువ పెట్టుకున్న నీళ్లను తాకుతుంటే షాక్‌ కొట్టినట్టు ఫీల్‌ అవుతున్నారు. ఎముకలు కొరికే చలితో రైతులు, పారిశుద్ధ్య కార్మికులు, పేపర్‌ బాయ్ పడే పాట్లు వర్ణనాతీతం. చలి దెబ్బకు మార్నింగ్ వాకర్స్‌ సైతం ఆసక్తి చూపడం లేదు.

పెరిగిన చలి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్ని దుస్తులు, ష్వెట్టర్లు ధరిస్తున్నారు. అయినప్పటికీ చలి తీవ్రత తగ్గకపోవడంతో గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు కాచుకుంటున్నారు. ఉదయం పదిగంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదని.. సాయంత్రం నాలుగు గంటల నుంచే రాకాసి చలి చంపేస్తోందని వాపోతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంతటి చలి తీవ్రతను చూడలేదని అంటున్నారు ప్రజలు.

మరోవైపు చలితో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, జలుబు బారిన పడుతున్నారు. అస్తమా రోగులైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తోందనన్న భయంతో ప్రజలు గజగజలాడుతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags:    

Similar News