హస్పిటళ్లకు డబ్బు జబ్బు చేసింది. ఆస్పత్రుల్లో అడుగుపెడితే చాలు అడ్డగోలు టెస్టులు చేస్తున్నారు. కరోనా సాకుతో లెక్కలేనన్ని పరీక్షలు చేసి లెక్కకుమించి బిల్లు చేతిలో పెడుతున్నారు. టెస్టుల ఫీజులను పెంచకూడదని ఐఎంఏ ఆదేశాలు జారీ చేసినా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులను జలగల్లా పట్టి పీడుస్తున్న నిజామాబాద్ లోని ప్రయివేట్ దవాఖానల తీరుపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.
రోగాలు పెరిగితేనే ఆసుపత్రుల ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కుదటపడేందుకు జనాలు ఎంత ఖర్చైనా వెనుకాడరు. ఇదే అదనుగా భావించిన ఉమ్మడి నిజామాబాద్ లోని కొన్ని ప్రయివేట్ దవాఖానలు డబ్బులు దండుకునే పనిలో పడ్డాయి. కరోనా పేరుతో అవసరమున్నా, లేకున్నా ఇష్టారాజ్యంగా టెస్టులు చేస్తున్నాయి. పైగా టెస్ట్ లకు అడ్డగోలుగా ఫీజులను పెంచేసి దోపిడీకి తెరలేపాయి.
నిజామాబాద్ లో సుమారు 150 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మరో 50 వరకు ప్రయివేట్ దవాఖానలు రోగులకు సేవలందిస్తున్నాయి. లాక్ డౌన్ వేళ మూతబడిన ఆసుపత్రులు సడలింపులతో మళ్లీ వైద్యసేవలు ప్రారంభించాయి. కానీ కరోనా ప్రోటెక్షన్ పేరుతో ఫీజులను అమాంతం పెంచేశాయి. ఓపీ నుంచి సర్జరీ వరకు అన్ని ఫీజులను పెంచడంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయివేట్ దవాఖానల్లో డాక్టర్ ని కలవాలంటే ఓపీతో పాటు శానిటైజర్, మాస్క్ ను దవాఖానకు సంబంధించిన మెడికల్ షాపులోనే కొనుగోలు చేయాలి. లేదంటే వైద్యుడి అపాయింట్ మెంట్ కష్టమే. కరోనా సాకుతో ఫీజుల పెంపుపై.. పలు ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ తో పాటు ఐఎంఏకు ఫిర్యాదులు చేశాయి. స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.
కరోనా జాగ్రత్తల్లో భాగంగా పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్క్ లు ధరించి వైద్యం అందిస్తున్నామని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. ఈ మేరకు ఖర్చులు పెరిగాయని అందుకే ఫీజులు పెంచాల్సి వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనా పనులు లేక ఇబ్బందులు పడుతున్నా జనాలకు పెరిగిన ఫీజులు గుదిబండగా మారాయి.