క్యాబ్ డ్రైవర్లను లాక్‌డౌన్ చేసిన కరోనా వైరస్.. ఇప్పుడిప్పుడు రోడ్డెక్కినా వెంటాడుతున్న కొత్త కష్టాలు
కరోనా పడగ పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఇప్పట్లో వారు ఏ మాత్రం కోలుకోకుండా చేసింది. మహమ్మారి రాకతో ప్రపంచ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. చాలా మందికి ఉపాధి లేక రోడ్డున పడ్డారు. చివరకు మూడు పూటల తిండి తినే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉన్నతంగా బతికిన చాలామంది ఇప్పుడు పూట గడవడం కోసం ఏదో ఒక పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీంగా మారింది. ఉపాధి లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాలుగు చక్రాలు రోడ్డెక్కితే గానీ నాలుగు వేళ్లు నోట్లోకి పోవు. ఒక్క రోజు పనికి పోకపోతే మరుసటి రోజు ఇళ్లు గడవవు. అలాంటి క్యాబ్ డ్రైవర్లను కరోనా లాక్‌డౌన్ చేసింది. మూడు నెలులగా ఎక్కడి కార్లు అక్కడే ఆగిపోవడంతో బతుకుబండి నడవడం కష్టమైంది. ఇప్పుడిప్పుడే రోడ్డెక్కినా కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక వేలాది కుటుంబాలు ఓ పూట తింటూ మరో పూట పస్తులుంటున్నాయి.
కరోనా వల్ల జనం ఆటోలు, క్యాబ్‌లు ఎక్కడం తగ్గించడంతో డ్రైవర్లందరికీ పని కరువైంది. ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తుండటంతో వీళ్లకు వర్క్ లేకుండా పోయింది. వస్తున్న ఆ కాస్త గిరాకీ పైసలు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకే సరిపోతుండటంతో డ్రైవర్లు ఆగమైతున్నారు. ఎంతకాలం ఇట్ల ఇబ్బంది పడ్తమని కొందరు వేరే చిన్నాచితకా పనులు వెతుక్కుంటుంటే ఇంకొందరు కార్లను అమ్ముకుంటున్నారు. మరికొందరు పట్నం వదిలి సొంతూర్లకు పోతున్నారు.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. ఆర్థిక పునాదుల్ని పెకిలించి చిన్నాభిన్నం చేసింది. చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇతని పేరు గణేష్ మీర్ పెట్ సమీపంలోని అల్మాస్ గూడా లో ఉంటున్నారు. గత కొన్నేళ్ల నుంచి ఓ ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న ఇతను కరోనా దెబ్బతో జాబ్ పోవడంతో ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. మూడు నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో చివరకు రూమ్ అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కూరగాయలు అమ్ముతున్నాడు. కూరగాయాలు అమ్మడం తప్పుకాకపోయినా కరోనా మహమ్మారి సామాన్యుడి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందో ఒక గణేష్ ఉదహరణ.
కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పరిశ్రమలు, కంపెనీలు మూతపడడం ఉద్యోగ రంగాన్ని కోలుకోకుండా చేస్తోంది. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో వీధినపడేది ఉద్యోగులేనన్న నివేదికలు ఎప్పటి నుంచో వెలుగు చూస్తున్నాయి. అయితే ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక మరింత భయాన్ని నెలకొల్పేలా ఉంది. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం లాక్ డౌన్ ప్రభావం కనీసం 30 కోట్ల మందిపై ప్రభావం ఉండబోతున్నట్టు చెప్తున్నాయి.
మూడు నెలల ముందు ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తోంది కరోనా. ప్రతి ఒక్కరిలో దడ పుట్టిస్తోంది. కరోనాకు ముందు మన జీవితం వేరు. అది ఎంటరయ్యాక మనం చూస్తున్న లైఫ్ స్టైల్ వేరు. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అనేంతలా ప్రపంచం మారిపోయే అవకాశముందని చెబుతున్నారు. మన తిండి, కట్టు, బొట్టు, వైద్యం ఒక్క మాటలో చెప్పాలంటే మన మన జీవితాలనే అది మార్చేస్తుందంటున్నారు నిపుణులు. కరోనాతో ఉపాధి కోల్పోయిన తమ లాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని ఆర్ధిక సహాయం చేయాలని కోరుతున్నారు క్యాబ్ డ్రైవర్లు.