Summer Effect: హైదరాబాద్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
Summer Effect: మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా రోడ్లు * అర్ధరాత్రి వేడిగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి
Summer Effect: భానుడి భగభగకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండ, వడగాలుల తీవ్రత పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రోజుకు 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏప్రిల్ నెల నుండే ఎండ తాకిడి ఎక్కువ అయ్యింది. దీంతో ఇదేం వేడి బాబు అంటూ తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి అయిన కాస్త చల్లగా ఉంటుందేమో అనుకుంటున్న నగరవాసులు విపరీతమైన వేడిగాలులతో ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. అటు ఎండలకు ఉదయం, సాయంత్రం సమయంలోనే జనం బయటకు వస్తున్నారు.
పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓవైపు గొంతు ఎండుకు పోతుండటంతో.. వేసవితాపం నుండి బయటపడటం కోసం నగర ప్రజలు చల్లని పానియాలతో సేదతీరుతున్నారు. సీజనల్ పండ్లతోపాటు కొబ్బరి బొండాలు, చెరుకు రసం, తాటి ముంజలను సమ్మర్ ఫుడ్‌గా తీసుకుంటున్నారు. వైద్యులు సైతం ఆరోగ్యానికి పుచ్చకాయలు, తాటిముంజలు మంచిదని సూచిస్తుండటంతో చిన్నపిల్లలు, పెద్దలు వీటిపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఇక రానున్న రోజుల్లో నగరవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పిల్లలు, పెద్దలు మధ్యాహ్నం సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచిస్తోంది. అదేవిధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా నీరు తీసుకోవడంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్యులు.