Nagarjuna Sagar: నాగార్జునసాగర్ దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్

Nagarjuna Sagar: ముళ్లకంచెల నడుమ డ్యాంపై పోలీస్ పహారా

Update: 2023-12-01 04:09 GMT

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్ 

Nagarjuna Sagar: నారార్జున సాగర్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న నీళ్ల పంచాయితీ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఏపీ ఇరిగేషన్ అధికారులు.. పోలీసులు అక్రమంగా సాగర్ కుడి కాల్వ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకూ దాదాపు 4 వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా ఏపీకి విడుదల చేశారు. ప్రస్తుతం 522 అడుగుల చేరువలో సాగర్ నీటి మట్టం కొనసాగుతోంది. మరో 12 అడుగులు తగ్గితే.. డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉందని సాగర్ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వం పాటించడం లేదని విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఇప్పటికే డ్యాంపై ఏపీ పోలీసులు మోహరించడంతో.. తెలంగాణ వైపు నుంచి కూడా పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం డ్యాంపై ముళ్లకంచెల నడుమ పోలీస్ పహారా కొనసాగుతోంది.

గత రెండు రోజులుగా.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో సుమారు 700 మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యాంపైకి చేరుకొని.. ప్రాజెక్టులోని 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ అధికారులు ప్రాజెక్ట్ అధికారులతో.. తెలంగాణ పోలీసులతో వాదనకు దిగారు. అడ్డుకున్న తెలంగాణ అధికారులను తోసేసి.. ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు అక్రమంగా సాగర్ రైట్ కెనాల్ నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ సమక్షంలో నీటిని విడుదల చేశారు. అయితే ఇది జరిగిన కాసేపటికి నీటి విడుదల కు బ్రేక్ పడింది. ఏపీ మోటార్లకు తెలంగాణ అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో, నీటి విడుదల ఆగిపోయింది. జనరేటర్ల సాయంతో.. మోటార్లకు కనెక్షన్ ఇచ్చి.. ఏపీకి నీటిని విడుదల చేయించారు. మరోవైపు దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ... తాగునీటి అవసరాల కోసమే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్‌లో తెలిపారు.

అయితే.. నీటిని విడుదల చేసిన ఘటన.. ప్రాజెక్ట్ అధికారులు, తెలంగాణ పోలీసులతో ఏపీ అధికారులు ప్రవర్తించిన తీరు.. ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. బుధవారం అర్ధరాత్రి దాదాపు 700 మంది పోలీసులు సాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అయితే డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై ఏపీ పోలీసులు దాడి చేశారు. 26 గేట్లలో 13వ గేట్‌ వరకూ తమ పరిధిలోకి వస్తుందని.. వాదిస్తూ... 13వ గేటు దగ్గర.. ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులను అడ్డుకున్న డ్యామ్ సిబ్బంది మొబైల్‌ ఫోన్లను లాక్కున్నారు. డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు.

గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగడంతో.. తెలంగాణ పోలీసులు బందోబస్తులో ఉన్నారు.. పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రికి.. డ్యాంపైకి తెలంగాణ పోలీసులు సైతం భారీ సంఖ్యలో చేరుకున్నారు. తెలంగాణ భద్రతా బలగాలు పోలింగ్ విధుల్లో ఉంటాయని తెలుసుకొని... ఏపీ అధికారులు పక్కాగా... బుధవారం అర్ధరాత్రి నుంచే.. ప్రాజెక్ట్‌ను అదుపులోకి తీుసుకోవాలనే... భారీ ఎత్తున పోలీసులతో సాగర్‌పై మోహరించారని తెలుస్తుంది. అయితే.. నీటిని విడుదల చేయకముందే.. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ డ్యామ్ రైట్ కెనాల్ దగ్గరకు చేరుకుని.. ఏపీ పోలీసులతో మాట్లాడినా.. వారు వెనక్కి తగ్గకపోగా.. రాత్రంతా సుమారు 6 గంటల పాటు ప్రాజెక్టుపై ఏపీ పోలీసులు వీరంగం సృష్టించినట్లు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఏపీ పోలీసులు డ్యాంపైకి అక్రమంగా చొరబడే టైంలో ప్రాజెక్ట్ సెక్యూరిటీ సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటతో... 700 మంది పోలీసులను అదుపు చేయలేకపోయినట్టు అర్ధమవుతోంది.

గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణ పోలీసులు పెద్దసంఖ్యలో నాగార్జునసాగర్‌ డ్యాం మీదకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న 13వ గేటు వరకు వచ్చారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ పోలీసు అధికారులు జేసీబీ సాయంతో 13వ గేటు వద్ద అడ్డుపెట్టిన ఇనుప కంచెను, బారికేడ్లను తొలగించడానికి ఉపక్రమిస్తుండగా విషయం తెలుసుకుని మరోమారు ఆంధ్రా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరురాష్ట్రాల పోలీసులు తుపాకులు చేతపట్టుకుని విధులు చేపట్టడంతో ఏం జరుగుతుందోనని క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి 13వ గేటు వద్దకు చేరుకుని ఆంధ్ర పోలీసులకు కొన్ని సూచనలు చేశారు. తెలంగాణ పోలీసులు దుశ్చర్యలకు పాల్పడితే వాటిని తిప్పికొట్టడానికి పోలీసు రక్షణ సామగ్రితో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు వారివారి భూభాగం పరిధిలో ఉంటూ పహారా కాస్తున్నారు.

Tags:    

Similar News