MLA Poaching Case: సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమన్న హైకోర్టు
MLA Poaching Case: ఎమ్మెల్యేలకు ఎరకేసులో తెలంగాణ సర్కారుకు చుక్కెదురు
MLA Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం,బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హై కోర్టు కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎం ఎల్ ఏ ల కొనుగోలు కేసులో హై కోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ కి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్ సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎమ్మెల్యేల కొనుగోలుకేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది.
దీంతోహైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు హై కోర్టు తీర్పు తో సీబీఐ ఇక రంగంలోకి దిగనుంది. ఇప్పటికే ఈ కేసు కి సంబంధించిన వివరాలను తమకు అందించాలని సీబీఐ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక తాజా గా కోర్టు ఇచ్చిన తీర్పు తో సీబీఐ తన దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుంది.