Munneru: మున్నేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉద్ధృతి..ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం
Flood Water Increasing in Munneru: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మున్నేరు వాగు మరోసారి పొంగిపొర్లే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. మున్నేరుకు మళ్లీ ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లారు.
Flood Water Increasing in Munneru: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు షురూ అయ్యాయి. శనివారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షం కురిసింది. దీంతో మళ్లీ మున్నేరు వాగులో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండంతో మున్నేరు వాగుకు మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది.
మున్నేరు వాగు పొంగే అవకాశం ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాకు బయలు దేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ఉద్ధృతిపై జిల్లా ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
మరోవైపు మున్నేరువాగు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఖమ్మం జల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉద్ధృతి పెరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్నప్తి చేశారు. వరదలతో ప్రభుత్వ తక్షణ చర్యలు తీసుకుంటుందని...సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లాలని మంత్రి కోరారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు సహాయచర్యలు కొనసాగుతాయని మంత్రి చెప్పారు.
వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు తాజా పరిస్థితులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు.
జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐఎండీ సూచనల ప్రకారం..జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ఉందని ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. అత్యవసరం అయితే టోల్ ఫ్రీ నెంబర్ 1077ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.