పర్యాటకులకు శుభవార్త.. ప్రారంభమైన నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం

Telangana Tourism: కార్తీక మాసం తొలిరోజు ప్రకృతి పర్యాటకులకు తెలంగాణ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-11-02 08:22 GMT

పర్యాటకులకు శుభవార్త.. ప్రారంభమైన నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం

Telangana Tourism: కార్తీక మాసం తొలిరోజు ప్రకృతి పర్యాటకులకు తెలంగాణ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు అద్బుత బోటు ప్రయాణాన్ని నవంబర్ 2 కార్తీక మాసం తొలిరోజు నుంచి ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్లాన్ చేస్తున్నప్పటికీ నాగార్జున సాగర్ డ్యాంలో సరైన మట్టంలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సారి వర్షాలు విస్తృత స్థాయిలో పడడం వల్ల కృష్ణానది తీరం వెంట అటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ డ్యాం వరకు గరిష్ట మట్టంలో నీరు ఉంది. దీంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇవాళ్టి నుంచి శ్రీశైలం వరకు బోట్ ప్రయాణాన్ని ప్రారంభించింది.

దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ లాంచ్ ప్రయాణానికి మొట్టమొదటి రోజున తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. కార్తీక మాసం సందర్భంగా సోమశిల నుంచి శ్రీశైలానికి, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచ్ ని అధికారులు ప్రారంభించారు.120 కిలోమీటర్లు, ఏడు గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది.

నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా, ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. కృష్ణానది ఒడిలో దట్టమైన నల్లమల అడవుల అందాలను వీక్షిస్తూ నదిలో జల విహారానికి తెలంగాణ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్టు పర్యాటక శాఖ తెలిపింది. ప్రయాణికులు, భక్తుల కోసం టూర్ ప్యాకేజీలు ప్రకటించినట్టు వెల్లడించింది.

సోమశిల నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్ తో పాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ రెండు వేర్వేరు ప్యాకేజీలకు ఒకే రకమైన టికెట్ ధరలే ఉన్నాయి. సింగిల్ జర్నీలో పెద్దలకు 2 వేల రూపాయలు, పిల్లలకు 16 వందల రూపాయలు.. రానుపోను పెద్దలకు 3 వేలు, పిల్లలకు 2,400 రూపాయల టికెట్ ధరను నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతో పాటు టీ, స్నాక్స్ ను పర్యాటక శాఖ అందించనుంది.

ఇక శ్రీశైలంలో రూమ్, ట్రాన్స్ పోర్ట్ వంటి వాటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ తెలిపింది. పకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులకు మైమరిపిస్తుంది. అతి తక్కువ ఖర్చుతో అంతులేని ఆనందాన్నిస్తోంది. ఈ జర్నీలో పక్షుల కిలకిలరాగాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News