తడిసి ముద్దయిన హైదరాబాద్.. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు GHMC హెచ్చరిక
Heavy Rains: హైదరాబాద్ నగరం మరోసారి వర్షంతో తడిసి ముద్దయ్యింది.
Heavy Rains: హైదరాబాద్ నగరం మరోసారి వర్షంతో తడిసి ముద్దయ్యింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత మొదలైన వర్షం తెల్లవార్లు కుండపోతగా కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,నాంపల్లి, ఖైరతాబాద్‌లతో పాటు పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు చేపడుతున్నారు.
మరో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 14 జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు జలకళసంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపునకు ఒంగి ఉంది. ఇంకా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున తెలుగు రాష్ర్టాల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి.