Telangana Rains: తెలంగాణలో దంచికొడుతున్న వానలు
Telangana Rains: లోతట్టు ప్రాంతాలు జలమయం, సిరిసిల్లలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
Telangana Rains: కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. పోటెత్తునున్న వరదలతో ప్రాజెక్టులు నిండకుండను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. సిరిసిల్ల పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరుచేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్టాండ్ నుండి కరీంనగర్ ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వరద నీరు ఇళ్లల్లోకి చేరుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వరద ప్రవాహంలో కారు చిక్కుకుని కొట్టుకుపోయింది. వేములవాడ మండలం ఫాజుల నగర్ నుండి జగిత్యాల వెళ్లే దారిలోని కల్వర్టు వద్ద ప్రవాహంలో కారు గల్లంతయింది. ఈ ఘటనలో వృద్దురాలు గంగ, బాలుడు కిట్టు చనిపోయారు. గంగ కొడుకు నరేష్, డ్రైవర్ రిజ్వాన్ ప్రాణాలతో బయటపడ్డారు. వీరు జగిత్యాల జిల్లా చెల్గాల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.