Heavy Rains In Mahabubnagar : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీరు పూర్తిగా లోతట్టు ప్రాంతాలకు చేరుకుంది. అంతే కాదు ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని భూత్పూర్ మండలం పోతుల మడుగు నుంచి గోపన్నపల్లి వెళ్లే దారిలో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో ఓ షేర్ ఆటో కొట్టుకుపోయింది. ముందుగా వేగంగా వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకుపోయిన ఆటోను తాడు కట్టి ట్రాక్టర్ ద్వారా లాగే ప్రయత్నం చేశారు. అయినా స్థానికల ప్రయత్నం ఫలించలేదు. ట్రాక్టర్ కు తాడు కట్టి లాగుతున్న సమయంలో తాడు ఒక్కసారిగా తెగిపోవడంతో ఆటో అదుపుతప్పి ఏకంగా కిలోమీటర్ దూరం వరదలో కొట్టుకు పోయింది. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో డ్రైవర్ ఒక్కడే ఉండి ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా కొట్టుకుపోయిన డ్రైవర్ ఈదుకుంటూ బయటకు వచ్చాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇదే తరహాలో నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా ఓ ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కోడేరు మండలం బావాయిపల్లి వాగులో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు కొట్టుపోయారు. ఆ సంఘటనను గమనించిన స్ధానికులు వెంటనే స్పందించి వారిని బయటికి తీసి వారి ప్రాణాలను కాపాడారు. మేస్త్రీ పనులు చేసుకొనేందుకు భార్యాభర్తలు పెద్ద కొత్తపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదే విధంగా ఉట్కూర్ మండలం పడిగిమారి వద్ద చీకటివాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో గొర్రెల కాపరి బాల్ రాజ్ గల్లంతయ్యాడు. అది గమనించి స్థానికులు వెంటనే అతన్ని బయటికి తీసి ప్రాణాలను కాపాడారు. అటు దేవరకద్ర మండలం కౌకుంట్ల వాగులో చేపల వేటకు వెళ్లి వెంకటేష్ వరద ఉదృతి పెరగటంతో వాగులో చిక్కుకున్నాడు. విషయం తెలిసిన గ్రామస్థులు అతన్ని కాపాడారు.