Hyderabad: హైదరాబాద్‌ను కమ్మేసిన ముసురు
* ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం * జోరువానతో స్తంభించిన జనజీవనం * లోతట్టు ప్రాంతాలు జలమయం
Hyderabad: హైదరాబాద్‌ను ముసురు కమ్మేసింది. ద్రోణి ప్రభావంతో నగరంలో జోరువాన కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో హైదరాబాద్‌లో జనజీవనం దాదాపు స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు, కూడళ్లలో పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే కాలనీలకు కాలనీలే నీట మునిగాయి. దాంతో, ఇళ్లల్లోకి నీళ్లుచేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక, ఈరోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. మూడ్రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. వాయు సమ్మేళనం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈనెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.