Hyderabad: హైదరాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం
Hyderabad: జలమయమైన లోతట్టు ప్రాంతాలు * నీటమునిగిన నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ
Hyderabad: హైదరాబాద్ జంట నగరాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురవడంతో చెరువుల్లోని నీరు ఇళ్లలోకి చేరాయి. భారీ వర్షానికి నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. కాలనీ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి తమ బంధువుల ఇళ్లలోకి వెళ్లగా మరికొందరు వర్షంలో తడుస్తూ రోడ్లపైనే ఉన్నారు. ఇక్కడ సుమారు 400 ఇళ్లు ఉండగా సగం ఇళ్లలోకి అర్ధరాత్రి వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో అయ్యప్పనగర్‌కాలనీ, మల్లికార్జుననగర్, ఫేజ్-2 త్యాగరాజనగర్‌కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి బయటకెళ్లారు.
ఎత్తైన ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి తల దాచుకోగా మరికొందరు బంధువుల ఇళ్లల్లోకి వెళ్లారు. చుట్టూ ఉన్న చెరువుల నీరు ఇక్కడికి వచ్చి చేరుతుందని మూడు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి ఇళ్లు మునుగుతున్నా జీహెచ్ఎంసీ ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కనీసం పునరావాసం కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది ఇదే పరిస్థితి ఎదురైతే అధికారులు వరద సాయం అందించి చేతులు దులుపుకున్నారని స్థానికులు వాపోయారు. శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ప్రతిసారి ఇళ్లు వదిలి రోడ్లపైకి రావాల్సి వస్తోందని మండిపడుతున్నారు.
నగరంలోని మిగతా చోట్ల కూడా అధికంగా వర్షం కురిసింది. హబ్సిగూడా, అంబర్‌పేట్, రామంతపూర్ డివిజన్లలో భారీగా వాన పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యూసుఫ్‌గూడ, శ్రీ కృష్ణనగర్ బి బ్లాకులో వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహించింది. సరూర్‌నగర్ చెరువు కట్ట లోతట్టు ప్రాంతంలో ఉన్న కోదండరాంనగర్, సీసల బస్తీ, వీవీ నగర్, కమలానగర్ ప్రాంతాల్లో వరదనీరు ఏరులై పారింది. ఆయా కాలనీల్లో వరద నీరు ఇళ్ల లోకి చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి నాని పాత మలక్‌పేటలోని పురాతన భవనం కూలిపోయింది.
వివిధ జిల్లాల్లోనూ వర్షం ఏకధాటిగా కురిసింది. మంచిర్యాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లాలో వర్షానికి వైరా నదితోపాటు కట్టలేరూలో భారీగా వరదనీరు చేరడంతో చిలుకూరు వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యామ్ సమీపంలోని వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.