Heat Wave: బాబోయ్ ఎండ.!జంకుతున్న జనం..అంతా మంచికే అంటోన్న నిపుణులు
Heat Wave: వేసవి తాపం వల్ల జనం అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎండలు మన మంచికే అంటున్నారు. ఎందుకో చూద్దాం?
Heat Wave: తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రరూపం దాల్చింది. ఉదయం నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మరోవైపు తీవ్ర వడగాలులు, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ నిపుణులు చల్లటి కబురు చెప్పారు. అదేంటి వర్షాలు ఉన్నాయా ?ఎండలు తగ్గిపోతాయా? అని అనుకొకండి. ఎండల గురించే నిపుణులు చెబుతున్నారు. వేసవి తాపం వల్ల జనం అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎండలు మన మంచికే అంటున్నారు. ఎందుకో చూద్దాం?
ఎండల వల్ల మంచి ఏమిటనే సందేహం తలెత్తడం సహజం. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉంటూ.. వడగాడ్పులు వీచిన ఏడాదిలో వచ్చే నైరుతి రుతుపవనాలు ఎంతో సానుకూలంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంటోన్నారు. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాల సీజనుకు ముందస్తుగా వచ్చే ఎండలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు. ఏటా పసిఫిక్ మహాసముద్రంలో లానినా, ఎల్‌నినో పరిస్థితులేర్పడుతుంటాయి. లానినా పరిస్థితులుంటే ఆ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటూ నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉండడానికి దోహదపడతాయి.
అలాగే వేసవి తాపం ఎల్‌నినో పరిస్థితులేర్పడితే అంతగా కనిపించదు. కానీ వర్షాలు సమృద్ధిగా కురవక కరువుకు దారితీస్తుంది. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో మోస్తరు లానినా పరిస్థితులున్నాయి. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది.
మరోవైపు ఎండ తెలుగు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర, వాయవ్య, తూర్పు మధ్య భారతదేశంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తాజా నివేదికలో తెలిపింది. గురువారం రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ఏపీలో 50 ప్రాంతాల్లో ఇదేమాదిరిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఒక వైపు సేకండ్ వేవ్ తో ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనా... మరో వైపు పూర్తి ఎండాకాలం రాకముందే వడగాలుల ముప్పుతో ప్రజల అల్లాడిపోతున్నారు. ఎక్కువ సమయం ఆరుబయట ఉంటే శరీరం వాతావరణంలోని వేడిని గ్రహిస్తుందని, ఇది ప్రమాదకరమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అయితే మధ్యాహ్నాం జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.