మోత్కుపల్లికి బంపర్ ఆఫర్.. కమలంతో కటీఫ్ అందుకేనా?
Motkupalli Narasimhulu: మోత్కుపల్లి ఎందుకు రూటు మార్చారు? వేదనా... ఆవేదనా...? రాజకీయ లాభమా వ్యక్తిగత ప్రయోజనమా?
Motkupalli Narasimhulu: మోత్కుపల్లి ఎందుకు రూటు మార్చారు? వేదనా... ఆవేదనా...? రాజకీయ లాభమా వ్యక్తిగత ప్రయోజనమా? కమలం పార్టీలో గౌరవం లేదన్న సాకు నిజమేనా? ఇన్నాళ్లూ గౌరవం లేకుండానే ఆ పార్టీలో కంటిన్యూ అయ్యారా? హుజూరాబాద్ ఉపఎన్నిక తరుముకొస్తున్న వేళ దళితబంధు ప్రాజెక్టుకు తుదిరూపు చేరుకుంటున్న వేళ రాజీనామా అస్త్రం ఎందుకు ప్రయోగించారు? హుజూరాబాద్‌లో బీజేపీని దెబ్బతీయాలన్న టీఆర్ఎస్ ఎత్తుగడకు మోత్కుపల్లి కారణం కాబోతున్నారా? అధికార పార్టీలో మంచి ఆఫర్ రావడం వల్లే కమలంతో కటీఫ్ అయ్యారా? ఇంతకీ మోత్కుపల్లి వ్యూహం ఏంటి గులాబీ ఉపాయం ఏంటి?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే సామెత తెలంగాణ రాజకీయాల్లో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఉద్యమ నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు స్వరం మార్చారు. తిట్టిన నోరుతోనే కేసీఆర్ అభినవ అంబేద్కర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇదే హాట్‌టాపిక్ కాగా అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది కూడా.
వాస్తవానికి ప్రగతిభవన్‌లో దళిత ఎంపర్‌మెంట్‌పై జరిగిన అఖిలపక్షం తర్వాత నుంచే మోత్కుపల్లి స్వరం మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళత బంధు పథకం ప్రకటించి దళితుల దేవుడిగా అవతారం ఎత్తారంటూ ఆకాశానికెత్తారు. దళిత వర్గాలకు అన్యాయం జరిగితే. వారికి అండగా ఉండడానికే తాను బీజేపీకి రాజీనామా చేసి స్వచ్చంధంగా కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నట్లు మోత్కుపల్లి చెబుతున్నారు. నాటి తిట్టిన తిట్లన్నీ టీడీపీ కోసమే తిట్టానని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌లో గౌతమబుద్ధుడి వలే మార్పు కనిపిస్తోందని మోత్కపల్లి సమర్దించుకుంటున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక అప్పుడో, ఇప్పుడో జరగక తప్పదు. ఆ ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థులు టీఆర్ఎస్, బీజేపీయే. ఈ రెండు పార్టీల మధ్యే పోరు హోరాహోరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి కమలనాథులను మోరల్ దెబ్బతీయాలంటే మోత్కుపల్లి లాంటి వాళ్లకు వల వేయాల్సిందేనని, అందుకు ఇదే అవకాశమని అధికార పార్టీ భావించి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే బీజేపీలో కొన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్న నేతలపై కన్నేసిన్నట్టు కనిపిస్తోంది. అదీగాక, మోత్కుపల్లి కూడా రాజకీయాల్లో చివరి అంకానికి చేరుకుంటున్నారు. అందుకే గౌరవప్రదమైన రిటైర్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా చివరి రోజుల్లో ఉండటంతో అధికార పార్టీలో చోటు దక్కితే మంత్రి హోదాను కోరే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
రైతుబంధు అమలు కోసం అప్పట్లో రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్ వేసినట్టుగానే దళితబంధు సమన్వయ కమిటీ వేసి దానికి ఛైర్మన్‌గా మోత్కుపల్లిని నియమించి, మంత్రి హోదా కల్పిస్తారన్న చర్చ తెలంగాణ రాజకీయల్లో సాగుతోంది. అందుకే మోత్కుపల్లి అదను చూసి అవకాశం కోసం సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీకి ఆయన అవసరం ఉందని తెలిసి కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి మోత్కుపల్లికి గులాబీ అధిష్టానం ఎలాంటి ఆఫర్‌ను ఇస్తుందో చూడాలి.