తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించిందా?

తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించిందా? కాంగ్రెస్ సంప్రదాయాన్నే తెలంగాణ బీజేపీ నేతలు ఫాలో అవుతున్నారా?

Update: 2024-07-02 15:30 GMT

తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించిందా?

తెలంగాణ: తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించిందా? కాంగ్రెస్ సంప్రదాయాన్నే తెలంగాణ బీజేపీ నేతలు ఫాలో అవుతున్నారా? మూడు ఫిర్యాదులు, ఆరు లీకులతో ఇప్పుడు ఆ పార్టీలో కూడా కాంగ్రెస్ కల్చర్ చొరబడింది అంటున్నారు. ముఖ్యనేతలు ఒకరిపై మరొకరు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారట. మరి కమలం పార్టీలో నెలకొన్న కల్లోలం ఏంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?

తెలంగాణ కమలంలో కల్లోలం నెలకొంది. ఆ పార్టీలో కాంగ్రెస్ కల్చర్ వచ్చిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ పార్టీ నేతలు కౌంటర్లు, ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఒకరిపై మరొకరు లీక్ లు ఇచ్చుకుంటున్నారట. అంతేకాదు హైకమాండ్ కు ఫిర్యాదులు కూడా ఇచ్చుకుంటున్నారట. బీజేపీ ముఖ్య నేతల్లో ఏ ఇద్దరు నేతలు కూడా కలిసి లేరన్న చర్చ ఆ పార్టీ కిందిస్థాయిలో జోరుగా వినిపిస్తోంది. ఎవరికి వారే యమునా తీరులాగే వ్యవహరిస్తున్నారట. పార్టీలో ఎవరికి వారే తమ గ్రాఫ్ పెంచుకోవాలనీ ఎవరి గ్రూపులను వారు ప్రోత్సహించుకుంటూ వెళ్తున్నారట. దీంతో నేతల మధ్య విభేదాలు పెరిగి గ్యాప్ ఎక్కువవుతూ వస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీజేపీలో కొంతకాలంగా అంతర్గత లొల్లి నడుస్తోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి కారణం అనే టాక్ ఉంది. అప్పట్లో పార్టీలోని ప్రముఖ నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. సీట్ల కేటాయింపులో తమ పంతమే నెగ్గాలంటే తమ పంతమే నెగ్గాలనే విధంగా వ్యవహరించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎవరి పనిలో వారు ఉండడంతో విభేదాలు పెద్దగా బయట పడలేదు అంటున్నారు ఆ పార్టీ కేడర్. ఎన్నికల సమయంలో తామే గెలవాలని మిగతావాళ్లు ఓడిపోవాలనీ కొంతమంది లీడర్లు అనుకున్నారట.

అయితే ఎన్నికల సమయంలో నాయకులు అంతర్గతంగా ఎలాంటి వైఖరితో ఉన్నారో ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా నాయకుల మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. నేతలు రోడ్డెక్కారు. కౌంటర్లు, ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమానికి ముందు ఒక ఎంపీ లీక్ లు ఇచ్చారట. కేవలం వాళ్లే గెలిచారా.. మేము గెలవలేదా అని ప్రచారం చేయించారట. ఏది జరిగినా ఠక్కున హై కమాండ్ కు ఫిర్యాదులు పంపిస్తున్నారట. కొందరు నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ ఇన్డైరెక్టుగా సూచనలు చేస్తున్నారట. పార్టీ అధ్యక్ష పదవి పాత నేతలకే రావాలని కొందరు ముఖ్య నేతలు భావిస్తుంటే... మరికొందరేమో తమకే రావాలనీ అధిష్టానం వద్ద పైరవీలు చేసుకుంటున్నారట. ఒకవేళ తమకు కాని పక్షంలో తమకు అనుకూలంగా ఉన్న నేతకే రావాలని భావిస్తున్నారట.

బీజేపీలో నెలకొన్న పరిస్థితిని చూస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. తమ పార్టీలో కూడా కాంగ్రెస్ కల్చర్ వచ్చేసిందని అనుకుంటున్నారట పలువురు రాష్ట్ర కమలనాథులు. ఇప్పుడు కాంగ్రెస్ లో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు కానీ.. వారి పార్టీలో కత్తులు దూసుకుంటున్నారని, ఇది మంచిది కాదని ఆవేదన చెందుతున్నారట. గతంలో పార్టీలో ఏదైనా జరిగితే పైకి మాత్రం అందరూ బాగానే ఉంటూ.. అంతర్గత వేదికల మీద అన్నీ మాట్లాడుకునే వారట. ఇప్పుడు ఏదైనా రచ్చకెక్కుతోంది అంటున్నారు.

మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సంస్కృతి బీజేపీకి వచ్చిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా నిలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కమలం పార్టీ వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి కాషాయ పార్టీ నేతల్లో నెలకొన్న వర్గ విభేదాలు వీడి ఏకతాటి మీదికి ఎప్పుడు వస్తారో చూడాలని ఎదురుచూస్తున్నారు ఆ పార్టీ కేడర్.

Tags:    

Similar News