వైఎస్ షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
* గత షరతులు వర్తిస్తాయన్న హైకోర్టు.. అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశం
YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పాదయాత్రకు ఎక్కడ బ్రేక్ పడిందో అక్కడి నుంచే మళ్లీ పునఃప్రారంభించనున్నారు. దీనికి తెలంగాణ హైకోర్టు అనుమతులను మంజూరు చేసింది. ఈ పరిణామం YSRTP క్యాడర్‌లో జోష్ నింపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట్‌లో జరిగిన దాడి వల్ల తాత్కాలికంగా నిలిపివేసిన పాదయాత్రను ఇక పునఃప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోన్నామని పేర్కొన్నారు.
వైఎస్ షర్మిలపై వరంగల్ జిల్లాలో జరిగిన దాడి ఆమె అరెస్ట్, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. హైదరాబాద్‌లో ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల చేసిన ప్రయత్నాలనూ పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం దీనిపై స్పందించారు. వైఎస్ షర్మిలను ప్రధాని మోడీ ఫోన్‌లో పరామర్శించారు.
తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో షర్మిల పాదయాత్రకు తాత్కాలికంగా మరోసారి బ్రేక్ పడినట్టయింది. దీంతో వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష కొనసాగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. షర్మిలను అపోలో ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. దీని తరువాత పాదయాత్రకు అనుమతులను కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే షరతులను విధించింది. ఇక ఇవాళ షర్మిల కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తన పాదయాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.