CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన గ్రేటర్ ఎమ్మెల్యేలు.. నోటరీ భూములను రెగ్యులరైజ్ చేయాలని వినతి
CM KCR: 58, 59 జీవో ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పెంచాలని..
CM KCR: హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పి్స్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నోటరీ స్థలాలను జీవో 58-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి.. తమకున్న నోటరీ తదితర ఇళ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలని సూచించారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు.
ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇళ్ల సమస్యలు పరిష్కారం కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఇందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే.. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక.. కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం చర్చించారు. జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.