GHMC Taking Care : కరోనా మృతదేహాలు అనాథ శవాలవుతున్నాయి. కడచూపుకు కూడా నోచుకొని దుర్భర పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. శవాన్ని మోసే వారు లేరు. శవాన్ని తరలించే వాహనాలు రావడం లేదు. ఆ మృతదేహాల అంత్యక్రియలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. కాల్చే కాటికాపారులు సైతం దగ్గరకు రావడం లేదు. ఎక్కడా తమకు వైరస్ సోకుతుందో అని భయపడుతున్నారు. ఇలాంటి క్షిష్టపరిస్థితుల్లో కరోనా మృతదేహాలపై బల్దియా కనికరం చూపుతోంది. కరోనా మృతదేహాలకు సంప్రదాయ పద్దతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించి శభాష్ అనిపించుకుంటోంది.
కరోనా భూతం కారణంగా రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయినట్లు వార్త రాగానే కుటుంబసభ్యుల తల్లఢిల్లిపోతున్నారు. మృతదేహాలను తీసుకువచ్చే వాహనాలు సైతం ముందుకు రావడం లేదు. శవాన్ని మోసే వారు కాదు కదా. కనీసం చూసే వారు కూడా కరువయ్యారు.
మరోవైపు శ్మశానవాటికల్లో కరోనా మృతదేహాలను కాల్చొద్దంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని భయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వినడం లేదు. ఇటీవల కాలంలో సనత్ నగర్ శ్మశానవాటికలో సగం కాలిన శవాన్ని కుక్కలు పీక్కతింటున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఏ పాపం చేయకుండా కరోనా మహమ్మారికి బలైన బాధితుల మృతదేహాలకు బల్దియా దిక్కైంది. ఆ శవాల అంత్యక్రియల బాధ్యతను బల్దియా భూజనవేసుకుంది. జీహెచ్ఎంసీ సిబ్బంది దగ్గరుండి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ సిబ్బందికి పలు స్వచ్చంధ సంస్థలు సహకారాలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్ కు చెందిన సామాజిక సేవకుడు గౌతమ్ అనాథ శవాలకు తానే స్వయంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పైగా సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి, వారి ఆత్మకు శాంతి చేకూర్చుతున్నారు.
ఓ మనిషి కాలం చేస్తే.. బంధుగణం, స్నేహితులు, చుట్టు పక్కల వారు అంతా కలిసి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు కరోనా కనీసం చివరు చూపుకు కూడా నోచుకోకుండా చేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది, ప్రజా సేవకులు చేస్తున్న ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.