GHMC Elections 2020: బండి సంజయ్ సవాల్‌తో చార్మినార్ దగ్గర హైటెన్షన్
* బండి సంజయ్ సవాల్‌తో అలర్టయిన హైదరాబాద్ పోలీసులు * చార్మినార్ భాగ్యనగర్ టెంపుల్ దగ్గర భారీ బందోబస్తు * ఫోర్జరీ సంతకంపై కేసీఆర్‌కు సవాల్ విసిరిన బండి సంజయ్ * కాసేపట్లో బీజేపీ కార్యాలయం నుంచి చార్మినార్ వరకు భారీ బైక్ ర్యాలీ * ర్యాలీకి అనుమతిలేదంటున్న పోలీసులు
హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్‌తో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛార్మినార్ భాగ్యనగర్ టెంపుల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఫోర్జరీ సంతకంపై బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వరద సహాయంపై లేఖ విషయంలో ప్రమాణం చేయడానికి రావాలని సవాల్ విసిరారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ ఆలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరద సహాయం విషయంలో సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్‌తో చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీగా సంజయ్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్దకు రానున్నారు. బీజేపీ వల్లే వరద సాయం నిలిచిందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపట్ల బీజేపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
వరద సాయం ఆపాలని తాను లేఖ రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే సీసీఎస్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. లేఖపై నిజాలు తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్షి ఆలయం వద్దకు రావాలంటూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
ర్యాలీగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు సంజయ్ చేరుకోనున్నారు. కాగా బీజేపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా...ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో 12 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వస్తామని బండి సంజయ్ ప్రకటించారు. కాగా ఈరోజు శుక్రవారం కావడంతో పోలీసుల్లో టెన్షన్ నెలకొంది.