GHMC Elections 2020: ఆపరేషన్ ఆకర్షణ్‌ను వేగవంతం చేసిన బీజేపీ
GHMC Elections 2020: * ఇతర పార్టీల్లోని అసంతృప్తులను కలుస్తున్న బీజేపీ నేతలు * బీజేపీలోకి చేరేందుకు విజయశాంతి, సర్వే సత్యనారాయణ సుముఖం * మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కూడా చేరే అవకాశంత * శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌తో బీజేపీ నేతల భేటీ * కమలం పార్టీలోకి రావాలని బండి సంజయ్, లక్ష్మణ్ పిలుపు
బల్దియా ఎన్నికలు ఒకపక్క కాక రేపుతుండగా.. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టింది. అసంతృప్త వర్గాన్ని క్యాష్ చేసుకునేందుకు సిద్దమైంది. ఇప్పటికే పలువురు నేతలతో మంతనాలు జరిపిన కమలం నేతలు.. మరికొందరు నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి.
ఆపరేషన్ ఆకర్షణ్‌ను బీజేపీ వేగవంతం చేస్తోంది. గ్రేటర్‌లో కమలం జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. పలు పార్టీల్లోని అసంతృప్తి నాయకులతో బీజేపీనేతలు వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అగ్ర నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి, సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ నాయకులు తెరలేపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే సర్వే సత్యనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకోనుండగా.. మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కూడా కమలం పెద్దలు మంతనాలు జరిపారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఆయా నేతలు ఖండించారు. దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కమలం కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.
2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యత తగ్గిందని భావిస్తోన్న.. మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు కూడా గాలం వేస్తోంది బీజేపీ. ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. స్వామిగౌడ్‌ను కలిసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్.. బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఇది జస్ట్ ఫ్రెండ్లీ మీటింగే అంటున్నారు స్వామిగౌడ్.