టీఆర్ఎస్‌‌కు గట్టి పోటీనిస్తోన్న బీజేపీ : ఓట్ షేర్‌ను భారీగా పెంచుకున్న కమలదళం

Update: 2020-12-04 10:13 GMT

గ్రేటర్ హైదరాబాద్‌ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు కనిపిస్తోంది. ఇప్పటికే 11 చోట్ల విజయం సాధించిన గులాబీ పార్టీ 60కి పైగా డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇక, అధికార పార్టీ టీఆర్ఎస్‌కు గట్టి పోటీనిచ్చిన బీజేపీ 30కి పైగా డివిజన్లలో ముందంజలో ఉంది. మరోవైపు, పాతబస్తీలో మళ్లీ తన పట్టు నిలుపుకుంటున్న మజ్లిస్ పార్టీ ఇప్పటికే 15చోట్ల విజయం సాధించి 20కి పైగా డివిజన్లలో ఆధిక్యం కనబర్చుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకట్రెండు డివిజన్లలో సత్తా చాటుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ పొల్గొన్న పోస్టల్ ఓట్లలో బీజేపీకి భారీ ఆధిక్యం వచ్చింది. పోస్టల్ ఓట్లలో బీజేపీకి ఆధిక్యం రావడంతో అదే ట్రెండ్ కొనసాగుతుందని భావించారు. కానీ, బ్యాలెట్ ఓట్ల దగ్గరకొచ్చేసరికి బీజేపీ జోరు తగ్గిపోయింది. తొలి రౌండ్ నుంచీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు కనిపించింది. అయితే, టీఆర్ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్న డివిజన్లలో కూడా బీజేపీ గట్టి పోటీనిస్తోంది. దాంతో, రౌండ్ రౌండ్‌కి కొన్నిచోట్ల ఆధిక్యాలు మారుతున్నాయి.

అత్యధిక డివిజన్లలో అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ బీజేపీ గట్టిపోటీనిస్తోంది. గతంతో పోలిస్తే ఓట్ షేర్‌‌ను భారీగా పెంచుకుంది. టీఆర్ఎస్ గెలిచిన డివిజన్లలో సైతం బీజేపీకి భారీగా ఓట్లు వచ్చాయి. ఏ డివిజన్‌లో చూసినా టీఆర్ఎస్‌ - బీజేపీ లేదా బీజేపీ - ఎంఐఎంలా పోరు నడుస్తోంది. మజ్లిస్ పార్టీకి అత్యంత పట్టున్న పాతబస్తీలో కూడా బీజేపీ సత్తా చాటింది. ఎంఐఎంకు దీటుగా ఓట్లు సాధించి చెమటలు పట్టించింది.

గ్రేటర్ ఎన్నికల్లో కారు దూసుకుపోతుండగా సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ, ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బీజేపీ, మజ్లిస్ రెండు పార్టీలు కూడా కొంచెం అటుఇటుగా దాదాపు సమాన స్థానాల్లో ఆధిక్యం కనబర్చుతున్నాయి. అయితే, పాతబస్తీలో పట్టు నిలుపుకుంటున్న ఎంఐఎం మరోసారి తన స్థానాలను దాదాపుగా నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

గ్రేటర్ ఫలితాల సరళిని గమనిస్తే అధికార టీఆర్ఎస్‌‌కు హెచ్చరికగానే భావించాల్సి ఉంటుందంటున్నారు. అత్యధిక డివిజన్లలో టీఆర్ఎస్‌కే ఆధిక్యం ఉన్నప్పటికీ అధికార పార్టీకి బీజేపీ గట్టిపోటీనిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ టీఆర్ఎస్‌పై ప్రజల కోపం స్పష్టంగా తెలుస్తోంది. పాలకులు జాగ్రత్తగా పనిచేయాలంటూ అధికార టీఆర్ఎస్‌‌కు హెచ్చరికలు పంపినట్లు గ్రేటర్ తీర్పు కనిపిస్తోంది. ఇకనైనా మారకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాక్ తప్పదనే సంకేతాలను హైదరాబాదీలు పంపారనేది మాత్రం వాస్తవమంటున్నారు విశ్లేషకులు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే విశ్లేషణ వినిపిస్తోంది. గ్రేటర్ పీఠం దక్కించుకునే స్థాయిలో సీట్లను గెలవకపోయినప్పటికీ వాళ్లు అనుకున్న టార్గెట్‌ను మాత్రం రీచ్ అయ్యిందంటున్నారు. అధికార టీఆర్ఎస్‌కు పోటీగా ఓట్ షేర్‌ను పెంచుకోవడమే కాకుండా గతంలో కంటే నాలుగైదు రెట్లు సీట్లను బీజేపీ పెంచుకోవడం సామాన్య విషయం కాదంటున్నారు. 2016లో కేవలం మూడు నాలుగు డివిజన్లలో మాత్రమే సత్తా చాటిన బీజేపీ ఈసారి 30కి పైగా స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తోంది. అంతేకాదు, మిగతా డివిజన్లలో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఓవరాల్‌గా గ్రేటర్ ఫలితాల సరళిని చూస్తే నైతికంగా బీజేపీ విజయం సాధించిందనే విశ్లేషణ వినిపిస్తోంది.

ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్‌ వైపే చూస్తోంది. హోరాహోరీగా సాగిన గ్రేటర్‌‌ పోరులో హైదరాబాద్ ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపారనేది తెలుసుకునేందుకు దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఫలితాలను పరిశీలిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడంతో జాతీయ ఛానెల్స్ సైతం GHMC కౌంటింగ్‌‌కు భారీ కవరేజ్ ఇస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల స్థాయిలో రౌండ్ రౌండ్‌కి హైదరాబాద్‌ ఫలితాలను ప్రసారం చేస్తున్నాయి.

Tags:    

Similar News