బీఫార్మసి విద్యార్థి కిడ్నాప్ కహానీకి శుభంకార్డు
* పోలీసుల చేసిన సైంటిఫిక్ దర్యాప్తుతో కిడ్నాప్ డ్రామా గుట్టు రట్టయింది * ఆటో డ్రైవర్లపై నెట్టిన నెపం తప్పని తేలింది.
బీఫార్మసి విద్యార్థి కిడ్నాప్ కహానీకి శుభంకార్డు పడింది. అల్లిన కట్టు కథ చిక్కుముడి వీడింది. పోలీసుల చేసిన సైంటిఫిక్ దర్యాప్తుతో కిడ్నాప్ డ్రామా గుట్టు రట్టయింది. ఆటో డ్రైవర్లపై నెట్టిన నెపం తప్పని తేలింది.
హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన విషయాలను వెల్లడించారు పోలీసులు. యువతి కిడ్నాప్‌ను ఓ కట్టుకథగా తేల్చారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్ వ్యవహారంలో ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు నిర్ధారించారు. ఆమె కావాలనే కట్టుకథలు అల్లిందని, పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టిందని స్పష్టం చేసారు.
మొదట ఘట్‌కేసర్‌లో యువతి కిడ్నాప్ సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా విద్యార్థినిని ట్రేస్ చేశామని, విచారణలో యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు వాస్తవాలు బయటపడ్డాయని సీపీ స్పష్టం చేశారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు ఈ హత్యాచారం వ్యవహారంలో ఆటో డ్రైవర్ పాత్ర లేదని తేల్చేశారు. తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులను నమ్మించడానికి తన దుస్తులను తానే చింపుకుందని, ఈ విషయాన్ని విద్యార్థిని తనకు తానే ఒప్పుకున్నట్లు రాచకొండ సీపీ అన్నారు
అసలు కిడ్నాప్ లేదు, రేప్ జరగలేదన్నారు. ఇదంతా యువతి ఆడిన డ్రామాగా తేల్చారు పోలీసులు. ఆ యువతి పోలీసులతో పాటు తల్లిదండ్రులను కూడా తప్పుదోవ పట్టించినట్లు స్పష్టం చేశారు. ముందుగా తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాప్ కేసుగా భావించిన పోలీసులు, సీసీటీవీ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. కిడ్నాప్ డ్రామా నిజమని నమ్మిన పోలీసులు అనుమనితులైన ఆటో డ్రైవర్లపై నిర్భయ యాక్ట్ నమోదు చేశారు. అనంతర పరిణామాలతో ఆటో డ్రైవర్ల తప్పేమీ లేదన్న పోలీసులు వారికి క్షమాపణ చెప్పారు.
గతంలో దిశా కేసులో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఘట్కేసర్ ఘటన కూడా అంతే సంచలనం సృష్టించింది. ఇదంత కట్టుకథ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి కిడ్నాప్ కథ కాస్త సుఖాంతం అయింది.