గతకొద్ది రోజులుగా జీహెచ్‌ఎంసీ మేయర్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి తిరిగి మహానగరంలో అధికారాన్ని చేజిక్కించుకుంది టీఆర్ఎస్. అనూహ్యంగా మజ్లిస్ కూడా టీఆర్ఎస్ పక్షానికి రావడంతో కారు పార్టీ మరోసారి మేయర్ పీఠం దక్కించుకుంది. అందరూ ఊహించినట్లే బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి మేయర్‌గా ఎన్నికయ్యారు.
చివరి క్షణం వరకు అభ్యర్థి పేరును సస్పెన్స్‌లో పెట్టిన టీఆర్ఎస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి పేరును ప్రతిపాదించింది. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విజయలక్ష్మి పేరు ప్రతిపాదించగా కార్పొరేటర్ శేషగిరి బలపరిచారు. ఇక బీజేపీ నుంచి రాధ ధీరజ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే విజయలక్ష్మి మేయర్‌గా గెలిచినట్లు ప్రకటించారు ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి. అటు ఎంఐఎం కూడా మద్దతివ్వడంతో టీఆర్ఎస్ సునాయాసంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
హైదరాబాద్ టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థిగా ఖరారైన గద్వాల విజయలక్ష్మి రెండోసారి బంజారాహిల్స్ కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఎంపీ కేశవరావు కూతురైన విజయలక్ష్మి జర్నలిజం బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలు పనిచేశారు. 2007లో స్వదేశానికి తిరిగొచ్చిన ఆమె.. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అమెరికా పౌరసత్వం వదులుకుని పాలిటిక్స్‌లోకి వచ్చారు.