CM Revanth Reddy: గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్..
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందుకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు.
CM Revanth Reddy: గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిన హైదరాబాద్‌ను ఇమేజ్‌ను మరింత పెంపొందించేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని సీఎం సూచించారు. ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నిమజ్జన మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గణపతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి గ్రేటర్ పరిధిలోని నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని పోలీసులకు సీఎం చెప్పారు.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందుకు సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకుంటే ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం తెలిపారు. మండపాల్లో డీజే సౌండ్లు వంటి అంశాల్లో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని సీఎం రేవంత్ తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పర్యావరణ హిత విగ్రహాలు ప్రతిష్టించాలని మంత్రి శ్రీధర్ బాబు ఉత్సవ సమితి నిర్వాహకులకు సూచించారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటి వరకు చేప్టటిన సమావేశాలు, ఉత్సవ సమితి సభ్యులు చేసిన సూచనలు, పరిష్కరించిన సమస్యల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు.