ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?
BJP: 40 నుంచి 50 మందితో ఫస్ట్ రిలీజ్ చేసే అవకాశం
BJP: తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోన్న బీజేపీ.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వస్తుండగా.. ఈ నెలలో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మరో వైపు అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్దమవుతోంది. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు అవ్వగా.. జాబితా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థులను రిలీజ్ చేసేందుకు అధిష్టానం రెడీ అయింది. ఢిల్లీలోని ప్రకాశ్ జవదేకర్ నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రక్రియలో భాగంగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల, డీకే అరుణ సమావేశానికి హాజరయ్యారు. కసరత్తు చేసిన జాబితాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడితో చర్చించారు. సుమారు 40 నుంచి 50 మందితో తొలి జాబితా ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తోంది బీజేపీ అధిష్టానం.
టికెట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే మహిళలకు టికెట్ల కోసం బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేసేలా అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్దపేట వేస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీసీ కార్డుతో అసెంబ్లీ బరిలోకి దిగనుంది బీజేపీ. గెలుపు గుర్రాలు లక్ష్యంగా అభ్యర్థుల ప్రకటన చేసేలా ప్లాన్ చేస్తోంది.
ఇక బీజేపీ మ్యానిఫెస్టో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటించనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీగా వరాలు ప్రకటించాయి. దీంతో బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వాలనే విషయంపై సమాలోచనలు చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలకు విభిన్నంగా కొత్త హామీలను పొందుపర్చనుంది. దీనిపై బీజేపీ వర్గాలు కసరత్తులు చేస్తోన్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటనతో పాటు ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆయా నేతలు తమ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తే.. బీజేపీ తన సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుందనే వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టేంత సంఖ్యాబలాన్ని పార్టీ సాధించలేదన్న విషయం అధిష్టానం పెద్దలకు సైతం అర్ధమైందనే చర్చ ప్రారంభమైంది.
అయితే కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యకర్గ సమావేశాల్లో రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వస్తాయని.. బీజేపీ కింగ్ మేకర్ గా మారి అధికారాన్ని చేపడుతుందనే సంకేతాలిచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ ఎన్నికలను ప్రతి నియోజకవర్గంలో త్రిముఖ పోరుగా మార్చాలని.. ముక్కోణపు పోటీ ఏర్పడితే బీజేపీ గెలుపు అవకాశాలు కూడా మెరుగుపడతాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ బీజేపీ ఆశించినన్ని సీట్లు సాధించలేకపోతే మిగతా రెండు పార్టీల్లో ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల యుద్ధాన్ని ముక్కోణపు పోటీగా మార్చి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పోలింగ్ తేదీ సమీపించేకొద్దీ రాష్ట్రంలో బీజేపీ కూడా ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేయాలని చూస్తోంది. నవంబర్ 28న ప్రచారం ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ సభల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారంలో పాల్గొనేలా పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.